చిత్తూరు టీడీపీలో ముసలం తీవ్ర రూపం దాల్చింది. అసంతృప్తి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు నుంచి ఏఎస్ మనోహర్ పేరును ఆపార్టీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించేసింది. అయితే మనోహర్‌ను తొలగించి సత్యప్రభకే సీటు ఇవ్వాలంటూ పలువురు టీడీపీ కార్పొరేటర్లు.. పార్టీ నాయకులు సోమవారం రోడ్డుపై నిరసన వ్యక్తంచేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అభ్యర్థిని మారిస్తే టీడీపీను ప్రజలు ఛీకొడతారంటూ అధిష్టానం యోచిస్తోంది.
చిత్తూరు అర్బన్: రాజకీయాల్లోకి వచ్చి ఆర్థికంగా తాను నష్టపోవడంతో పాటు ప్రశాంతత లేకుండాపోయిందంటూ సత్యప్రభ తన అనుచరుల వద్ద పేర్కొన్నట్లు సమాచారం. చిత్తూరు నుంచి పోటీ చేయాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకొస్తున్న కార్యకర్తలతో సత్యప్రభ గట్టిగానే మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘సొంత డబ్బు పెట్టి గెలిస్తే.. ఎందుకూ పనికిరానివారి వద్ద మాటపడ్డాను. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. నోటికొచ్చినట్లు నన్ను మాట్లాడినారు. ఇక చాలు.. నన్ను వదిలేయండి. ప్రశాంతంగా ఉండనివ్వండి. నాకు ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశంలేదు. ఎవరినైనా నిలబెట్టండి, ఎవరికైనా పనిచేసుకోండి..’ అంటూ సత్యప్రభ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
మోసపోనున్న మనోహర్
చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏఎస్ మనోహర్ ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించేసుకున్నారు. తనకున్న పాత పరిచయస్తుల ఇళ్లకు వెళ్లడం.. ఈసారి తనను గెలిపించాలని కోరుతున్నారు. ఆర్థికంగా కూడా మందీ మార్బలాన్నికూడగట్టుకుని ప్రధాన టీడీపీ నేతలను కలుస్తున్నారు. ఇలాంటి సమయంలో సత్యప్రభకు టికెట్టు ఇవ్వాలంటూ ఆమె మద్దతుదారులు, టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి రావడం అంతా పథకం ప్రకారమే జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని నమ్మి వచ్చిన మనోహర్‌ను మోసం చేసి వెన్నుపోటు పొడవనున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు మనోహర్ వద్ద ఎన్నికల్లో పోటీ చేసేంత ఆర్థిక స్థోమత లేదని కూడా ఆ పార్టీ నాయకులు ప్రచారం చేయడం ఒక ఎత్తయితే ద్వితీయశ్రేణి నాయకులకు సత్యప్రభ నుంచి పెద్ద మొత్తంలో ఆర్థికసాయం అందదనేది అసలు సత్యం. చిత్తూరు టీడీపీ అభ్యర్థిని మార్చాల్సిందేనంటూ కొందరు సీఎం ఎదుట పంచాయతీ పెట్టడానికి అమరావతికి బయలుదేరగా మరికొందరు ఓ అడుగు ముందుకేసి గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో బీ–ఫామ్ చేతికొచ్చేంత వరకు టీడీపీ అభ్యర్థి ఎవరనేది తేల్చుకోలేకపోతున్నారు.
కోడ్ లెక్కలేదా?
మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నవేళ టీడీపీ నేతలు రోడ్లపై నిరసనలు వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. రాత్రిళ్లు గాంధీ విగ్రహం ఎదుట నిలబడి నినాదాలు చేయడం, గుమి కూడడం ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. దీనిపై పోలీసు శాఖ స్పందించకుండా కలెక్టర్ చూసుకోవాలని, రెవెన్యూ అధికారులు పరిశీలించాలని తప్పించుకుంటున్నారు. పోలీసులు అధికార పార్టీ నాయకులపట్ల వ్యవహరిస్తున్న తీరుకు ఇదే నిదర్శమని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment