వొడితెల సతీశ్ కుమార్( మధ్యలో వ్యక్తి : పాత చిత్రం )
సాక్షి, హుస్నాబాద్ : హుస్నాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నాయకుడు వొడితెల సతీశ్‌కుమార్‌కు మరోసారి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామానికి వెళ్తున్న క్రమంలో.. గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతూ ఆయనను అడ్డుకున్నారు. ‘ఏమీ చేయని ఎమ్మెల్యే మా గ్రామంలోకి రావొద్దు’ అంటూ నినాదాలు చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించారు. ఈ ఆందోళనలో సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ నేతలు వీరికి మద్దతు పలికారు.
టీఆర్‌ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం..
తమ నాయకుడిని అడ్డుకోవంతో సహించలేని టీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకారులను పక్కకు నెట్టేశారు. మహిళలతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న చిగురుమామిడి సురేందర్ సీఐ అక్కడికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. తమపై ఎన్ని కేసులు పెట్టినా సరే సతీశ్‌ను గ్రామంలోకి రానివ్వమంటూ నినదించారు. 15 ఏళ్లుగా మట్టిరోడ్లతో ఇబ్బంది పడుతున్నామని, తాగడానికి మంచి నీళ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గతంలో కూడా వొడితెలకు ఇలాంటి అనుభవాలు చాలానే ఎదురయ్యాయి. తాజాగా ప్రచారంలో భాగంగా తనకు అడ్డుపడిన వారిపై సతీశ్ బూటు కాలితో దాడి చేయడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. (ప్రచారంలో రెచ్చిపోయిన తాజా మాజీ ఎమ్మెల్యే)
Comments
Please login to add a commentAdd a comment