![TRS Leader Satish Kumar Loose Control In Election Campaign - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/4/sathish-babu.jpg.webp?itok=Yo8aOnmx)
ఘర్షణ పడుతున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు
సాక్షి, హుస్నాబాద్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నాయకుడు వొడితెల సతీశ్ కుమార్ రెచ్చిపోయారు. తనను నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్తలపై బూటు కాలితో దాడి చేశారు. వివరాలు.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు టీఆర్‌ఎస్ నాయకుడు వొడితెల సతీశ్ కుమార్ బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు తమ నిరసన తెలియజేసేందుకు రోడ్డుపై బైఠాయించారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని, తమ గ్రామాన్ని అనవసరంగా అక్కన్నపేట మండలంలో కలిపారని వొడితెలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాగా ఈ ధర్నాలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా ఉండటంతో.. ఒక్కసారిగా సహనం కోల్పోయిన వొడితెల వారిపైకి దూసుకెళ్లారు. అక్కడున్న వారిని బూటు కాలితో తన్నుకుంటూ వెళ్లడంతో వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఎమ్మెల్యే అనుచరులు, స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు కూడా ఎమ్మెల్యేకు జతచేరి నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై దాడికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాటతో సుమారు 20 నిమిషాల పాటు యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. చివరకు పోలీసుల జోక్యంతో ఇరువర్గాలు శాంతించాయి.
Comments
Please login to add a commentAdd a comment