సాగు నీటితో ఓట్ల పంట | Warangal Voters Review on Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

సాగు నీటితో ఓట్ల పంట

Published Fri, Mar 15 2019 10:35 AM | Last Updated on Fri, Mar 15 2019 10:35 AM

Warangal Voters Review on Lok Sabha Elections - Sakshi

గడ్డం రాజిరెడ్డి/వరంగల్‌ : తెలంగాణలోనే కీలకమైన వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పలు సమస్యలు తిష్టవేశాయి. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుతో పాటు కొత్తగా చేయబోయే వాగ్దానాలే ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. నెరవేరని హామీల్లో కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండగా.. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. టెక్స్‌టైల్‌ పార్కు మంజూరైనా పనులు ముందుకు సాగడం లేదు. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు ఏళ్ల తరబడిగా ఎన్నికల నినాదంగానే మిగులుతోంది. మామూనూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ విషయం కేంద్ర ప్రభుత్వ పరిశీలన నుంచి బయటపడటం లేదు. స్థలం, నిధుల కేటాయింపులు జరిగినా.. ఆచరణకు నోచుకోవడం లేదు. ఐదు వందల రోజులకు పైగా ఆందోళన చేసి అలసిపోయిన మంగపేట బిల్టు ఫ్యాక్టరీ కార్మికుల వెతలు తీరడం లేదు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం వివిధ సాగునీటి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించడం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది.

రైల్వే పనులకు ఎర్రజెండా
2010–11 సంవత్సరంలో మడికొండ వద్ద గల అయోధ్యపురంలో వ్యాగన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ మంజూరైంది. దీని కోసం ప్రభుత్వం శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాదాయ స్థలం 55 ఎకరాలు ప్రతిపాదించింది. అయితే ఈ స్థలాన్ని అధికారికంగా రైల్వేకు అప్పగించలేదని సమాచారం. దీంతో వ్యాగన్‌ షెడ్‌ నిర్మాణం పెండింగ్‌లో ఉంది. 2015–16లో వ్యాగన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ స్థలంలో వ్యాగన్‌ పిరాడికల్‌ ఓవరాలింగ్‌ షెడ్‌ను రైల్వేశాఖ మంజూరు చేసింది. దీనికి 110 ఎకరాల స్థలం సిద్ధం కాగా, ఇంకో 50 ఎకరాల స్థలం కావల్సి ఉంది. పూర్తిస్థా«యిలో భూమి అప్పగించకపోతే ఈ షెడ్‌ కూడా తరలిపోయే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో సికింద్రాబాద్‌ తర్వాత అతి ప్రధానమైన కాజీపేట జంక్షన్‌ను రైల్వే డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉంది.

గాల్లోనే..ఎయిర్‌పోర్ట్‌
దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తొలిసారిగా వాయుదూత్‌ విమానంలో మామునూరులో దిగారు. అప్పుడు పురుడుపోసుకున్న ప్రతిపాదన నేటికీ కార్యరూపం దాల్చడం లేదు. మామునూరు ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు అంశం ఎప్పటికప్పుడు రెండడుగులు ముందుకు మూడడుగులు వెనక్కి సాగుతోంది. భూసేకరణ కార్యక్రమం ఇంకా కొనసా..గుతూనే ఉంది. మామునూరులో విమానాశ్రయం ఏర్పాటుకు 1960 కన్నాముందే భూసేరకరణ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆ సమయంలో ఏనుమాముల గ్రామం పరిధిలో 320 ఎకరాలు, నక్కలపల్లి పరిధిలో 96 ఎకరాలు, తిమ్మాపురం పరిధిలో 290 ఎకరాలు.. మొత్తం 706 ఎకరాలు సేకరించారు. విమానాశ్రయానికి కనీసం 1200 ఎకరాలకు తగ్గకుండా భూమి ఉండాలని చెప్పడంతో అదనంగా 450 ఎకరాలను సేకరించడం కోసం గాడిపల్లి పరిధిలో 243, ఇతర సమీప గ్రామాల్లో మరో 184, మొత్తం 427 ఎకరాలు  అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. 2008లో ఒకసారి కేంద్రం నుంచి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రతినిధుల బందం జిల్లాకు వచ్చి విమానాశ్రయం ఏర్పాటుకు స్థలం పరిశీలించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాజా ఢిల్లీ పర్యటనలో కూడా విమానాశ్రయాల విషయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులతో చర్చించారు.

పార్కు ఓకే.. పనులే మొదలు కాలే..
2014 ఎన్నికల సందర్భంగా అజాంజాహీ మిల్లు కంటే అతిపెద్ద పార్కు ఏర్పాటు చేస్తామని అన్ని పార్టీలు హామీనిచ్చాయి. అందుకు తగ్గట్లుగా వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గీసుకొండ, చింతలపల్లి గ్రామాల్లో 1200 ఎకరాల భూమిని సేకరించారు. ఈ పార్కును రూ.1150 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు 2017 అక్టోబర్‌ 22న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ పార్కులో రూ. 11,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.13 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. అయితే యేడాది కాలంలో ప్రహరీ గోడ నిర్మాణం, పలు రోడ్డు నిర్మాణాలు మాత్రమే       చేపట్టారు. పార్కుకు సంబంధించిన లేఔట్‌ పూర్తి కాక                 పరిశ్రమల స్థాపనకు స్థలాల కేటాయింపు జరగలేదు.

రీ‘బిల్ట్‌’ కాలేదు..
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఏకైక భారీ పరిశ్రమగా గుర్తింపు పొందిన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని బిల్ట్‌ రేయాన్స్‌

ఫ్యాక్టరీ 2014లో మూతపడింది. దీంతో నేరుగా 1800 మంది, పరోక్షంగా 10 వేల మంది ఉపాధి కోల్పోయారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలుమార్లు బిల్ట్‌ యజమాన్యంతో చర్చలు జరిపింది. ఫ్యాక్టరీని పునర్‌ ప్రారంభించేందుకు ప్రభుత్వం నుంచి రూ.350 కోట్లు అందిస్తామని చెప్పినా.. యజమాన్యం ముందుకు రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 400 రోజుల పాటు కార్మికులు ఆందోళనలు చేశారు. బిల్ట్‌ను పునరుద్ధరించేందుకు నాటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్‌ చొరవ తీసుకున్నా.. సాధ్యం కాలేదు.

ప్రాజెక్టులు పచ్చగా...
దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో హామీలు పరిష్కారం దిశగా సాగుతున్నాయి. సాగునీరు, వ్యవసాయం, రహదారుల అభివృద్ధి, ప్రాజెక్టుల విషయంలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేరాయి. బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు రూ.80,500 కోట్లతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులు దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సాగునీటి కొరత తీరనుంది. ప్రాజెక్ట్‌ ద్వారా 180 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా ఎస్‌ఆర్‌ఎస్‌పీ నిండిన తర్వాత కాలువల ద్వారా ఉమ్మడి వరంగల్‌కు నీరు వస్తుంది. ఎస్‌ఆర్‌ఎస్పీ స్టేజ్‌–1, స్టేజ్‌–2 ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ప్రయోజనం చేకూరనుంది.  మిడ్‌మానేరు, ఎల్‌ఎండీ ద్వారా ఉమ్మడి వరంగల్‌కు 50 టీఎంసీల నీరు రానుంది. ఎస్సారెస్పీ కాల్వ నిర్మాణ పనులకు రూ.1,000 కోట్లు కేటాయించారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని డీబీఎం 16, 18, 31, 38 కాల్వల ద్వారా 83 వేల ఎకరాలకు నీరందించేందుకు ఎస్సారెస్పీ కాలువల పునరుద్ధరణ వేగవంతం చేస్తున్నారు. ఎస్సారెస్పీ, ఘన్‌పూర్, భీంఘన్‌పూర్‌ చెరువులు, ఇతర చెరువుల మైనర్‌ ఇరిగేషన్‌ ద్వారా భూపాలపల్లి నియోజకవర్గంలో లక్షా 90 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.

కేసీఆర్‌ నీళ్లిస్తడు..
తెలంగాణ అంతటా పంట పొలాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు గింత జెప్పన పూర్తయిదనుకోలేదు. రెండున్నరేళ్లకే ప్రాజెక్టు పనులన్నీ చివరి దశకు చేరినయ్‌. కేసీఆర్‌ అనుకున్న సమయానికి నీళ్లిస్తడనే నమ్మకం పెరుగుతుంది. ప్రాజెక్టు నీళ్లస్తనే బీడు పడ్డ భూములన్నీ పచ్చగా మారుతయ్‌. ఈయేడు వర్షాకాలం పంటలకు నీళ్లిస్తనని కేసీఆర్‌ గట్టిగా సెప్పిండు. అదే పద్ధతిన నీళ్లు కాల్వల ద్వారా వదులుతరని రైతుల్లో సంబురం మొదలైంది. మేడిగడ్డ బ్యారేజీ పనులు మా కండ్ల ముందటనే దినదినం వాయువేగంతో జరుగుతున్నయ్‌.– చల్లా కృష్ణారెడ్డి, రైతు, సూరారం,జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా

రైతుల త్యాగాలు వృధా కావు
కాళేశ్వరం ప్రాజెక్టు రైతులందరికీ గొప్ప వరం. రాష్ట్రంలోని బీడు భూములకు నీళ్లు వస్తే రైతులు కడుపు నిండా అన్నం తింటరు. ఇన్నేండ్లు అప్పులు తెచ్చి వడ్డీలు కట్టక ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ప్రాజెక్టుతో రైతులకు చేతి నిండా పని దొరికి ఊరటగా ఉంటది. పంట భూములు పచ్చని తెలంగాణగా మారుతయ్‌. అన్నారం బ్యారేజీ రెండేళ్లలోనే కట్టిండ్రు. ఈ వర్షాకాలంలో నీళ్లు వదులుతరని ఇంజనీర్లు అంటుండ్రు. నీళ్లు రాష్ట్రమంతా పారితే కాళేశ్వరం ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతుల త్యాగాలు వృధాగా పోవు. మా రైతుల పేర్లు చిరకాలం గుర్తుండి పోతది.– వేమునూరి శేఖర్, అన్నారం గ్రామ రైతు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా

మా నియోజకవర్గానికినీళ్లు కావాలె..
కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం పచ్చగా మారుతుంది. సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో ప్రాజెక్టుకు రీడిజైన్‌ చేసిండు. రివర్స్‌ పంపింగ్‌ విధానంతో అత్యాధునిక టెక్నాలజీతో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు, కన్నెపల్లి పంప్‌హౌస్‌ల నిర్మాణాలు త్వరగా పూర్తయితున్నయ్‌. ఈ ప్రాజెక్టు ద్వారా మంథని నియోజకవర్గం రైతుల భూములకు కూడా ప్రాజెక్టు నీళ్లు ఇయ్యాలే. కాళేశ్వరం ప్రాజెక్టుతో నియోజకవర్గంలోని చెరువులకు నీళ్లు నింపి, ఇక్కడి రైతులకు మొదటి పంపు నీళ్లు అందించేలా అవకాశం కల్పించాలి.– శనిగరం శ్రీనివాసరెడ్డి,కాళేశ్వరం కిరాణా వ్యాపారి

రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీచిరకాల కోరిక
రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. 1982లో కాజేపీటకు మంజూరైంది. అప్పుడు కూడా స్థలం మంజూరు విషయంలో జాప్యం జరిగింది. దీంతో పంజాబ్‌కు తరలిపోయింది. 2014లో తెలంగాణ విభజన సమయంలో విశాఖ రైల్వే జోన్, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ మంజూరుకు పార్లమెంట్లో తీర్మానం చేశారు. విశాఖ జోన్‌ ఇచ్చిన కేంద్రం కాజీపేటకు కోచ్‌ ఫ్యాక్టరీ ఇచ్చే విషయంలో అన్యాయం చేసింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోచ్‌ ఫ్యాక్టరీని మంజూరు చేయాలి.– దేవులపల్లి రాఘవేందర్, రైల్వే జేఏసీ కన్వీనర్‌

కోచ్‌ ఫ్యాక్టరీ వస్తేఅభివృద్ధి జరిగేది..
కోచ్‌ ఫ్యాక్టరీ కాజేపీటకు వస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుంది. చిన్న పరిశ్రమలు వస్తాయి. ఈ ప్రాతం మరింత అభివృద్ధి చెందుతుంది. రైల్వే పరంగా కాజీపేట ప్రాధాన్యత పెరుగుతుంది. ఇన్ని లాభాలున్నా.. ఎందుకో ఎవరూ పట్టించుకోవడం లేదు. – ఆర్‌.రవీంద్రనాథ్, కాజీపేట 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement