జూనియర్ ద్రవిడ్ వచ్చేశాడు!
స్కూల్ క్రికెట్‌లో సెంచరీ చేసిన సమిత్
బెంగళూరు: భారత మాజీ ఆటగాడు, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ బాటలోనే అతని కొడుకు కూడా పోటీ క్రికెట్‌లోకి దూసుకొస్తున్నాడు. అండర్-14 స్థాయి క్రికెట్‌లో ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న 11 ఏళ్ల సమిత్ ద్రవిడ్ ఈ సీజన్‌లో సెంచరీతో సత్తా చాటాడు. ‘టైగర్ కప్’ టోర్నీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు యునెటైడ్ క్రికెట్ క్లబ్ (బీయూసీసీ)కి ప్రాతినిధ్యం వహించాడు. ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో సమిత్ 125 పరుగులు సాధించాడు. సహచర ఆటగాడు ప్రత్యూష్ (143)తో కలిసి సమిత్ 213 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో బీయూసీసీ 246 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
గత సంవత్సరం స్కూల్ క్రికెట్‌లో ఆకట్టుకున్న సమిత్, అండర్-12 విభాగం టోర్నీ గోపాలన్ క్రికెట్ చాలెంజ్‌లో ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. తనతో పోలిస్తే సమిత్ బాగా దూకుడుగా ఆడతాడని, ప్రతీ బంతిని బాదే ప్రయత్నం చేస్తాడని కొన్నాళ్ల క్రితం స్వయంగా ద్రవిడ్ చెప్పుకున్నాడు. సచిన్ కుమారుడు అర్జున్ తర్వాత ఇప్పుడు సమిత్ రాకతో మరో తరం వారసులు కూడా సిద్ధమైనట్లే.