అమిత్ భండారీ(ఫైల్‌ఫొటో)
న్యూఢిల్లీ: ఢిల్లీ, ఢిల్లీ డిస్ట్రిక్స్ అసోసియేషన్(డీడీసీఏ) సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అమిత్ భండారీపై దాడికి పాల్పడిన అండర్-23 క్రికెటర్ అనూజ్ దేడాపై జీవితకాలం నిషేధం విధించారు. ఈ మేరకు ఆ క్రికెటర్‌ను జీవితకాలం ఏ క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు డీడీసీఏ స్పష్టం చేసింది. ‘ అమిత్ భండారీపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన యువ క్రికెటర్ అనూజ్ దేడాపై జీవితకాల నిషేధం విధిస్తున్నాం. ఇక్కడ అనూజ్ దేడాపై న్యాయపరమైన చర్యలను పక‍్కకు పెడితే, అతను ఇక నుంచి ఏ క్రికెట్ ఆడకుండా జీవితకాలం నిషేధం విధిస్తూ చర్యలు తీసుకున్నాం’ అని డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ తెలిపారు.
భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్, డీడీసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ అమిత్ భండారిపై సోమవారం అనూజ్ బృందం గుంపుతో కలిసి దాడికి దిగింది. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ కోసం స్థానిక సెయింట్ స్టీఫెన్స్ మైదానంలో సాగుతున్న ఢిల్లీ సీనియర్ క్రికెట్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను భండారి పరిశీలిస్తుండగా హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్ చైన్లతో దాడికి తెగబడింది. వీరిలో ఒకడు తుపాకీతో బెదిరించాడు. దీంతో భండారి పారిపోయేందుకు యత్నించినా వెంటాడి మరీ కొట్టడంతో తీవ్ర అలజడి రేగింది.
Comments
Please login to add a commentAdd a comment