సౌతాంప్టన్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇక‍్కడ జరగబోయే నాల్గో టెస్టులో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది. నాటింగ్‌హామ్‌లో జరిగిన మూడో టెస్టుకే అశ్విన్ ఫిట్‌గా లేకపోయినప్పటికీ, కీలక మ్యాచ్ కావడంతో అశ్విన్‌ను ఆడించినట్లు తెలుస్తోంది.
ఆ టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ గాయం కారణంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క ఓవర్ వేసిన అశ్విన్ ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 22.5 ఓవర్లు వేశాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌కు ఒకే ఒక్క వికెట్ దక్కింది. నాలుగో టెస్టు ప్రారంభానికి రెండు రోజులు సమయం ఉన్నప్పటికీ అశ్విన్ గాయం నుంచి కోలుకున్నట్లుగా కనిపించడం లేదు.
దీంతో అతడి స్థానంలో రవీంద్ర జడేజాను తీసుకోవాలని జట్టు భావిస్తోందట. తొలి మూడు టెస్టుల్లో జడేజా తుది జట్టులో లేడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైనా అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఒకవేళ అశ్విన్ దూరమైన పక్షంలో జడేజాకే తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ స్పిన్‌తో పాటు బ్యాటింగ్ కూడా అవసరమే కాబట్టి, జడేజా వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది.
భారత్-ఇంగ్లండ్‌ల మధ్య నాలుగో టెస్టు ఈ నెల 30న ప్రారంభం కానుంది. మూడు టెస్టులు ముగిసే సమయానికి భారత్ 1-2తో వెనుకంజలో ఉంది. తొలి రెండు టెస్టులు ఇంగ్లండ్ గెలిస్తే.. మూడో టెస్టులో టీమిండియా విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment