![Gurjit hat-trick: India in semis - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/3/gurjith.jpg.webp?itok=eyKenA1K)
కకమిగహర (జపాన్): కొత్త కోచ్ హరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో భారత మహిళల హాకీ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో టీమిం డియా వరుసగా ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. కజకిస్తాన్‌తో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 7–1 గోల్స్ తేడాతో జయభేరి మోగించింది. ‘డ్రాగ్ ఫ్లికర్’ గుర్జీత్ కౌర్ (4వ, 42వ, 56వ నిమిషాల్లో) హ్యాట్రిక్ సాధించి భారత్ ఘనవిజయంలో కీలకపాత్ర పోషించింది. నవ్‌నీత్ కౌర్ (22వ, 27వ ని.లో), దీప్ గ్రేస్ ఎక్కా (16వ, 41వ ని.లో) రెండేసి గోల్స్ చేశారు. కజకిస్తాన్ జట్టుకు వెరా దొమషనెవా (2వ ని.లో) ఏకైక గోల్‌ను అందించింది. ఆరం భంలోనే గోల్ సమర్పించుకున్న భారత జట్టు వెంటనే తేరుకొని సమన్వయంతో ఆడుతూ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై ఎదురుదాడులు చేసింది. తొలి గోల్ ఇచ్చిన రెండు నిమిషాలకే భారత్ కూడా గోల్ సాధించి స్కోరును 1–1తో సమం చేసింది.
ఆ తర్వాత భారత క్రీడాకారిణులు మరింత జోరు పెంచి ఆరు గోల్స్ చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నారు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో చైనా 10–0తో థాయ్‌లాండ్‌పై, దక్షిణ కొరియా 9–0తో సింగపూర్‌పై, డిఫెండింగ్ చాంపియన్ జపాన్ 2–0తో మలేసియాపై గెలిచాయి. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో జపాన్‌తో భారత్; కొరియాతో చైనా తలపడతాయి. ఈ ఈవెంట్‌లో భారత్ ఒకసారి విజేతగా (2004), రెండు సార్లు రన్నరప్‌గా (1999, 2009), రెండు సార్లు మూడో స్థానంలో (1994, 2013), రెండు సార్లు నాలుగో స్థానంలో (1989, 2007) నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment