ఆషామాషీగా తీసుకుంటే అంతే!
ఐర్లాండ్ మరోసారి సంచలనం సృష్టించింది. అండర్ డాగ్ గా తమ మీదున్న అంచనాలను నిజం చేసింది. గతంలో ఇంగ్లండ్ లాంటి అగ్రశేణి జట్టుపై 320 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించి సంచలనం రేపిన ఈ చిన్న జట్టు మరోసారి ఈ ఫీట్ రిపీట్ చేసింది. తాజా వరల్డ్ కప్ లో వెస్టిండీస్ కు షాక్ ఇచ్చింది.
11వ ప్రపంచకప్ లో భాగంగా సోమవారం నెల్సన్ లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించి టాప్ టీమ్ లకు తీసిపోమని చాటింది. 305 పరుగుల భారీ లక్ష్యం ముందున్నా ఐర్లాండ్ బ్యాట్స్ మెన్ బెదిరిపోలేదు. పైపెచ్చు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఆరంభం నుంచే విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.
పాల్ స్టిర్లింగ్(92), జొయస్(84), ఓబ్రిన్(79) ఐర్లాండ్ ఇన్నింగ్స్ కు మూలస్తంభాల్లా నిలిచారు. విండీస్ బౌలర్ల అలవోగా ఎదుర్కొని పరుగులు వరద పారించారు. చక్కటి భాగస్వామ్యాలు నమోదు చేసి జట్టు విజయానికి బాటలు వేశారు. ఒక గెలుపు ఖాయమనుకున్న దశలో ఐర్లాండ్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా చెదిరింది. జట్టు స్కోరు 273 పరుగుల వద్ద జొయస్ అవుటకాగానే వరుసగా వికెట్లు పడిపోవడంతో ఐర్లాండ్ జోరు కాస్త తగ్గింది. అయితే జోరు మీదున్న ఓబ్రిన్ లాంఛనం పూర్తి చేశాడు.
తమను ఆషామాషీగా తీసుకోవద్దని ఈ విజయంతో అగ్రశేణి జట్లకు ఐర్లాండ్ సంకేతమిచ్చింది. చిన్నజట్టే కాదా అని తేలిగ్గా తీసుకుంటే భంగపాటు తప్పదని హెచ్చరిక పంపింది. మార్చి 3న జరిగిన తర్వాతి మ్యాచ్ ఐర్లాండ్ పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టును ఢీకొనబోతోంది. సంచలనం పునరావృతమవుతుందో, చతికిలబడుతోందో తేలాలంటే అప్పటివరకు వేచి చూడాల్సిందే.