టీమిండియా.. పసికూనలతో జర జాగ్రత్త!
వన్డే ప్రపంచ కప్ సమరం రసవత్తరంగా మారింది. తొలి రెండు రోజులు అంచనాలకనుగుణంగా ఫలితాలు వచ్చినా.. మూడో రోజు సంచలనం నమోదైంది. తొలి నాలుగు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసి.. 300, ఆ పైచిలుకు భారీ స్కోరు సాధించిన జట్లనే విజయం వరించింది. దీంతో 300 మార్క్ లక్ష్యం సాధించడం కష్టమనే అభిప్రాయం ఏర్పడింది. అయితే సోమవారం ఈ అంచనాలు తప్పని తేలింది. టోర్నీలో తొలిసారి 300పైచిలుకు లక్ష్యం కరిగిపోయింది. ఇంతటి లక్ష్యాన్ని ఛేదించింది ఏ అగ్రశ్రేణి జట్టో కాదు.. పసికూన ఐర్లాండ్.! ఐర్లాండ్ తొలి మ్యాచ్లో మాజీ చాంపియన్ వెస్టిండీస్కు షాకిచ్చింది. తద్వారా ఎంత పెద్ద జట్టునయినా మట్టికరిపించే సత్తా ఉందని ఐర్లాండ్ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. అగ్రశ్రేణి జట్లు.. పసికూనలే కదా అని అలసత్వం ప్రదర్శిస్తే భారీ మూల్యం చెల్లించకతప్పదు. పసికూనలతో జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా టీమిండియా. గ్రూపు దశలో భారత్.. ఐర్లాండ్, జింబాబ్వేలతో ఆడాల్సివుంది.
గ్రూప్-బిలోనే జింబాబ్వేతో మ్యాచ్లో ఫేవరేట్ జట్లలో ఒకటయిన దక్షిణాఫ్రికా 340 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయినా జింబాబ్వే తొణకలేదు. ఓడినా పోరాటపటిమతో ఆకట్టుకుంది. సఫారీలపై పసికూనలు 277 పరుగులు చేయడం ఆషామాషీ కాదు. గ్రూపు-బిలో ఉన్న భారత్కు ఈ రెండు ఫలితాలు ఓ హెచ్చరిక. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఘనవిజయం సాధించి శుభారంభం చేసిన భారత్కు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ల రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ రెండు జట్లపై టీమిండియా గెలవాలంటే తీవ్రంగా శ్రమించకతప్పదు. కాబట్టి ధోనీసేనకు పసికూనలు జింబాబ్వే, ఐర్లాండ్, యూఏఈతో మ్యాచ్లు కీలకం. భారత్ నాకౌట్ చేరాలంటే వీటిపై నెగ్గడం చాలా అవసరం. జింబాబ్వే అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకుంటోంది. ఇక ఐర్లాండ్కు తనదైన రోజున ఏ జట్టునయినా ఓడించగల సత్తా ఉంది. ఈ రెండింటితో పోలిస్తే యూఏఈ అంత ప్రమాదకరం కాకపోవచ్చు. ఏదేమైనా టీమిండియా పసికూనలతో జాగ్రత్తగా ఉండకతప్పదు.