లయన్స్కు కింగ్స్ షాక్
రాజ్కోట్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ లయన్స్ కు కింగ్స్ పంజాబ్ షాకిచ్చింది. ఆదివారం జరిగిన పోరులో లయన్స్ పై పంజాబ్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ విసిరిన 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ తడబడి ఓటమి పాలైంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్కు కెప్టెన్ మురళీ విజయ్(55;41 బంతుల్లో 6 ఫోర్లు), స్టోయినిస్(27;17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి ఆరంభాన్ని అందించారు. ఈ జోడీ తొలి వికెట్ కు 40 బంతుల్లో 65 పరుగులు నమోదు చేసి శుభారంభాన్ని అందించారు. తరువాత పంజాబ్ వరుసగా కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పంజాబ్ టాపార్డర్ ఆటగాళ్లలో షాన్ మార్ష్(1), మ్యాక్స్వెల్(0), గురకీరత్ సింగ్(0) లు తీవ్రంగా నిరాశపరిచారు. మురళీ విజయ్ తో పాటుడేవిడ్ మిల్లర్(31), సాహా(33;19 బంతుల్లో 4ఫోర్లు) లు ఫర్వాలేదనిపించడంతో పంజాబ్ 154 పరుగులు స్కోరును నమోదు చేసింది. గుజరాత్ బౌలర్లలో శివిల్ కౌశిక్ వికెట్లతో ఆకట్టుకోగా, బ్రేవో, ప్రవీణ్ కుమార్ లు తలో రెండు వికెట్లు సాధించారు.
సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన గుజరాత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆటగాళ్లు బ్రెండన్ మెకల్లమ్(1), డ్వేన్ స్మిత్(15) లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరి నిరాశపరిచారు. ఆ తరువాత సురేష్ రైనా(18), దినేష్ కార్తీక్(2), రవీంద్ర జడేజా(2), బ్రేవో(0)లు ఘోరంగా విఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. గుజరాత్ ఆటగాళ్లలో ఇషాన్ కిషన్(27), ఫల్కనర్ (32) మినహా ఎవరూ ఆకట్టుకోలేక పోవడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసి ఓటమి చెందింది. పంజాబ్ బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లతో రాణించగా, మోహిత్ శర్మకు మూడు వికెట్లు దక్కాయి. తద్వారా టోర్నీలో పంజాబ్ కు రెండో విజయం సాధించగా, గుజరాత్ రెండో ఓటమిని ఎదుర్కొంది.