ఆనాటి లాహోర్ పేలుళ్ల వల్లే..
కరాచీ:తమ దేశంలో క్రికెట్ మ్యాచ్ లు ఆడేందుకు వెస్టిండీస్ తొలుత మొగ్గుచూపినా, ఆ తరువాత వెనుకడుగు వేయడానికి లాహోర్ పేలుళ్ల ఘటనే ప్రధాన కారణమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తాజాగా స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా పాకిస్తాన్లో కొన్ని మ్యాచ్ లు ఆడేందుకు వెస్టిండీస్ సుముఖతం వ్యక్తం చేసిన తరుణంలో లాహోర్ పేలుళ్లు వల్ల వారు వెనుకంజ వేసినట్లు పీసీబీ ఎగ్జిక్యూటివ్ చీఫ్ నజీమ్ సేథీ తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా 2009లో శ్రీలంక జట్టుపై తీవ్రవాదుల దాడి చేసిన ఘటనను సేథీ గుర్తు చేసుకున్నారు.
'ఇరు దేశాల సిరీస్లో కొన్ని పరిమిత ఓవర్లు మ్యాచ్లు ఆడాలని విండీస్ను అభ్యర్థించాం. వారు పాకిస్తాన్ క్రికెట్ కు సహకారం అందించడానికి ముందుకొచ్చారు. ఆ చర్చలు కూడా విజయమంతమయ్యాయి. పాకిస్తాన్ లో ఆటగాళ్లకు భద్రతపరమైన కారణాలతో విండీస్ ఆలోచనలో పడింది. ఆ సిరీస్కు పాకిస్తాన్ కు రాలేమంటూ తేల్చిచెప్పింది. దాదాపు చర్చలు సఫలమైనట్లుగా భావించిన తరువాత విండీస్ విముఖత వ్యక్తం చేయడానికి లాహోర్ పేలుళ్లే కారణం. అవి పాకిస్తాన్ క్రికెట్కు తీవ్రం నష్టం కల్గించాయి.ఇక చేసేది లేక ఆ మొత్తం సిరీస్ను యూఏఈలోనే ఆడాల్సి వస్తుంది'అని సేథీ అన్నారు.