ఇదే జోరు కొనసాగిస్తా! | o continue the same pace! | Sakshi
Sakshi News home page

ఇదే జోరు కొనసాగిస్తా!

Published Wed, Nov 18 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM

ఇదే జోరు కొనసాగిస్తా!

ఇదే జోరు కొనసాగిస్తా!

మరిన్ని విజయాలే లక్ష్యం
హైదరాబాదీలకు రుణపడి ఉంటా
‘సాక్షి’తో సానియా మీర్జా
 

హైదరాబాద్: జూనియర్ వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన నాటి నుంచి వరల్డ్ నంబర్‌వన్ కావడం వరకు తన ప్రయాణం అద్భుతంగా సాగిందని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గుర్తు చేసుకుంది. ఈ క్రమంలో అండగా నిలిచిన అనేక మంది హైదరాబాదీలకు రుణపడి ఉంటానని ఆమె వ్యాఖ్యానించింది. మంగళవారం ‘వొలిని’ ఉత్పత్తుల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సానియా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడింది. విశేషాలు ఆమె మాటల్లోనే...

ఈ ఏడాది ప్రదర్శనపై: చాలా అద్భుతంగా సాగింది. ఏప్రిల్‌లో వరల్డ్ నంబర్‌వన్ అయినా అదే ర్యాంక్‌తో సీజన్‌ను ముగించడం ఆనందాన్ని రెట్టింపు చేసింది. రెండు గ్రాండ్‌స్లామ్‌లు, డబ్లూటీఏ ఫైనల్స్ ఒకే ఏడాది గెలవడంతో నా కల నిజమైనట్లుగా ఉంది. ఈ సంవత్సరం ఐటీపీఎల్‌లో కూడా గెలిచి ఘనమైన ముగింపు ఇవ్వాలని కోరుకుంటున్నా.

 హింగిస్‌తో భాగస్వామ్యంపై: గతంలో కారా బ్లాక్, బెథానీలతో కూడా మంచి ఫలితాలు సాధించాను. అయితే ఇప్పుడు హింగిస్‌తో జత కలవడంతో గొప్ప ఫలితాలు వచ్చాయి. ఒకరిని ఒకరు నమ్మడం, పరస్పరం ప్రోత్సహించుకోవడంతోనే మా విజయ యాత్ర సాధ్యమైంది.
 వచ్చే సీజన్ లక్ష్యాలపై: మేం ఇప్పుడున్న ఫామ్‌తో మరిన్ని టైటిల్స్ నెగ్గడం ఖాయం. అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాం. 2015లో సాధ్యం కాని (ఫ్రెంచ్ ఓపెన్) టోర్నీలు గెలవాలని పట్టుదలగా ఉన్నాం. అయితే ఏదైనా కారణంతో ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధించలేకపోయినా... కనీసం ఈ ఏడాది సాధించినదానికి తగ్గకుండా గెలవడమే లక్ష్యం.

ఓవరాల్ కెరీర్‌పై: నేను జూనియర్ వింబుల్డన్ గెలిచిన నాటి మధుర స్మృతులు ఇంకా మదిలో ఉన్నాయి. ఆ రోజునుంచి ఇప్పుడు వరల్డ్ నంబర్‌వన్ కావడం వరకు చూస్తే అంతా కలలా అనిపిస్తోంది. ఈ ప్రయాణంలో అనేక మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు, మీడియా నాకు సహకారం అందించారు. మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురైనా మొత్తం గా చాలా గొప్పగా సాగింది. ఈ ఘనత నా ఒక్కదానిదే కాదు. మొత్తం హైదరాబాదీలది. కష్టకాలంలో నాకు ఎంతో మంది అండగా నిలిచారు. వారందరికీ ఎంతో రుణపడి ఉంటా.

 అకాడమీ ఫలితాలపై: ప్రస్తుతానికి నా అకాడమీ బాగానే నడుస్తోంది. చాలా మంది  ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహిస్తున్నాం. పెద్ద స్థాయిలో ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. భవిష్యత్తులో భారత్ నుంచి ఒక గొప్ప ప్లేయర్ ఇక్కడ నుంచి తయారు కావాలని ఆశిస్తున్నా. వర్ధమాన ఆటగాళ్లకు తగిన సూచనలిచ్చేందుకు వచ్చే వారం మార్టినా నవ్రతిలోవాలాంటి దిగ్గజం మా అకాడమీకి రానుంది. అక్కడ నేను, మార్టినా, లియాండర్ పేస్, మహేశ్ భూపతి కలిసి ఎగ్జిబిషన్ మ్యాచ్ కూడా ఆడబోతున్నాం.

 టెన్నిస్ కెరీర్ తర్వాత: బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం, టీవీ షోల్లో కనిపించడం వరకు ఇబ్బంది ఉండదు. నాకు నటన అస్సలు చేతకాదు. అది నాకు పరిచయం లేని అంశం. కొంత మంది నేను సినిమాల్లో చేరవచ్చంటూ చెబుతున్న వార్తల్లో నిజం లేదు. సినిమావాళ్లు స్నేహితులు మాత్రమే. కేవలం టెస్టుల నుంచి మాత్రమే రిటైరైన షోయబ్ మాలిక్ ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది. కాబట్టి మేమిద్దరం కలిసి భాగస్వాములుగా ఇప్పుడే ఎలాంటి కార్యక్రమాలూ చేసే అవకాశం లేదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement