సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజీ క్రాస్ కంట్రీ రేస్ పోటీల్లో బి. ప్రశాంత్, పి. కావ్య విజేతలుగా నిలిచారు. ఓయూ వేదికగా ఆదివారం జరిగిన ఈ పోటీలను ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) ఎం. నర్సింహులు ప్రారంభించారు. పురుషుల 10 కి.మీ. రేస్‌లో నిజాం కాలేజీకి చెందిన ప్రశాంత్ చాంపియన్‌గా నిలిచాడు. అతను అందరికన్నా ముందుగా 33 నిమిషాల 32.4 సెకన్లలో పరుగును పూర్తి చేసి అగ్రస్థానాన్ని అందుకున్నాడు. రెండోస్థానంలో నిలిచిన హెచ్‌జీపీఎం అథ్లెట్ ఎస్. వినోద్ 33 నిమిషాల 50 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. అవంతి కాలేజీకి చెందిన ఎ. పవన్‌తేజ (33ని. 55.7సె.) మూడోస్థానంలో నిలిచాడు. మహిళల కేటగిరీలో వనితా కాలేజీకి చెందిన కావ్య 38 నిమిషాల 8.02 సెకన్లలో రేస్‌ను ముగించి విజేతగా నిలిచింది.
ఎన్. సుచిత్ర (సెయింట్ ఆన్స్; 39ని.13.2సె.), ఎస్. అనురాగ (సెయింట్ ఆన్స్; 42ని.51సె.) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. పురుషుల టీమ్ చాంపియన్‌షిప్‌ను నిజాం కాలేజీ గెలుచుకుంది. 58 పాయింట్లతో నిజాం జట్టు టైటిల్‌ను అందుకుంది. అవంతి కాలేజీ (67 పాయింట్లు), భవన్స్ వివేకానంద (75 పాయింట్లు) తర్వాతి స్థానాలను సాధించాయి. మహిళల టీమ్ చాంపియన్‌షిప్‌ను సెయింట్ ఆన్స్ (30 పాయింట్లు) జట్టు దక్కించుకుంది. జీసీపీఈ 35 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. భవన్స్ (78 పాయింట్లు) జట్టుకు మూడోస్థానం దక్కింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ ఎల్‌బీ లక్ష్మీకాంత్ రాథోడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment