చచ్చీ చెడీ గెలిచారు!
♦ రాయుడు వీరోచిత సెంచరీ
♦ తొలి వన్డేలో భారత్ విజయం
♦ ఓడినా ఆకట్టుకున్న జింబాబ్వే
♦ చిగుంబురా శతకం వృథా
ఆ ఏముందిలే... జింబాబ్వే జట్టేగా..! అంటూ ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో వెళ్లిన భారత్ తొలి వన్డేలో ఉలిక్కి పడింది. సొంతగడ్డపై జింబాబ్వే క్రికెటర్లు అద్భుతంగా పోరాడి భారత్‌కు ముచ్చెమటలు పట్టించారు. అన్ని విభాగాల్లోనూ ఢీ అంటే ఢీ అనే తరహాలో పోరాడారు. ఫలితంగా రహానే సేన తొలి వన్డేలో చచ్చీ చెడీ నాలుగు పరుగులతో గట్టెక్కింది. తెలుగుతేజం అంబటి రాయుడు అమోఘమైన ఇన్నింగ్స్‌తో అజేయ సెంచరీ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
హరారే : బంగ్లాదేశ్ చేతిలో సిరీస్ ఓడి విమర్శలపాలైన భారత్... మరో ఘోర పరాజయం నుంచి తృటిలో తప్పించుకుంది. జింబాబ్వే కెప్టెన్ ఎల్టన్ చిగుంబురా (101 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) ఎదురుదాడికి బెంబేలెత్తిన టీమిండియా... చివర్లో తేరుకుని మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. తెలుగుతేజం అంబటి తిరుపతి రాయుడు (133 బంతుల్లో 124 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్), స్టువర్ట్ బిన్నీ ((76 బంతుల్లో 77; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 4 పరుగుల స్వల్ప తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. మొదట భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 255 పరుగులు చేసింది. తర్వాత జింబాబ్వే 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసి ఓడింది.
ఆదుకున్న రాయుడు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలో జింబాబ్వే బౌలర్లు ఝలక్ ఇచ్చారు. ఓపెనర్లలో మురళీ విజయ్ (1) తొందరగా అవుటైనా.. రహానే (49 బంతుల్లో 34; 5 ఫోర్లు), రాయుడు నెమ్మదిగా ఆడారు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. అయితే రహానే అవుటైన తర్వాత స్వల్ప విరామాల్లో మనోజ్ తివారీ (2), ఉతప్ప (0), కేదార్ జాదవ్ (5)లు వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో భారత్ 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తడబడింది.
ఈ దశలో రాయుడు, బిన్నీలు నాణ్యమైన ఇన్నింగ్స్‌తో చెలరేగారు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నెమ్మదిగా పరుగులు జోడిస్తూ పోయారు. 29వ ఓవర్‌లో 72 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన రాయుడు ఆ తర్వాత మరింత బాధ్యతగా ఆడాడు. మరోవైపు క్రీమర్ బౌలింగ్‌లో బిన్నీ భారీ హిట్టింగ్‌కు తెరలేపడంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. 63 బంతుల్లో బిన్నీ అర్ధ సెంచరీ పూర్తి చేయగా, రాయుడు 117 బంతుల్లో శతకాన్ని నమోదు చేశాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 160 పరుగులు జోడించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. తిరిపానో, చిబాబా చెరో రెండు వికెట్లు తీశారు.
చిగుంబురా పోరాటం
భారీ లక్ష్యం కళ్లముందున్నా... జింబాబ్వే ఆటగాళ్లు స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో చెలరేగారు. 47 పరుగులకే ఓపెనర్లిద్దరూ అవుటైనా... పెద్దగా తడబడకుండా ఇన్నింగ్స్‌ను నిర్మించారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన చిగుంబురా యాంకర్ పాత్రతో ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. మసకద్జా (34)తో కలిసి మూడో వికెట్‌కు 42, రజా (37)తో కలిసి నాలుగో వికెట్‌కు 48 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. భారత బౌలర్ల విజృంభణకు ఓ దశలో జింబాబ్వే 160 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
కానీ లోయర్ ఆర్డర్‌లో క్రెమెర్ (27) సాయంతో చిగుంబురా టీమిండియా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఏడో వికెట్‌కు ఏకంగా 86 పరుగులు జోడించి భారత్ శిబిరంలో ఆందోళన కలిగించాడు. అయితే చివరి 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన దశలో క్రెమెర్‌ను ధవల్ అవుట్ చేయగా, భువనేశ్వర్ ఆఖరి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేసి అనూహ్య ఓటమిని అడ్డుకున్నాడు. బిన్నీ, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఆదివారం జరుగుతుంది.
2 రాయుడు కెరీర్‌లో ఇది రెండో సెంచరీ. గతేడాది లంకపై తొలి శతకం సాధించాడు.
160 రాయుడు, బిన్నీ ఆరో వికెట్‌కు నెలకొల్పిన భాగస్వామ్యం. వన్డేల్లో ఈ వికెట్‌కు భారత్‌కు ఇదే అత్యుత్తమం. గతంలో జింబాబ్వేపై ధోని, యువరాజ్ 158 పరుగులు జోడించారు.
124 (నాటౌట్) వన్డేల్లో రాయుడుకు ఇదే అత్యధిక స్కోరు
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) మసకద్జా (బి) తిరిపానో 34; విజయ్ (సి) సిబండా (బి) విటోరి 1; రాయుడు నాటౌట్ 124; మనోజ్ తివారీ ఎల్బీడబ్ల్యూ(బి) చిబాబా 2; ఉతప్ప రనౌట్ 0; జాదవ్ (సి) ముత్తుబామి (బి) చిబాబా 5; బిన్నీ (సి) ముత్తుబామి (బి) తిరిపానో 77; అక్షర్ పటేల్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (50 ఓవర్లలో 6 వికెట్లకు) 255.
వికెట్ల పతనం: 1-9; 2-60; 3-74; 4-77; 5-87; 6-247.
బౌలింగ్: పన్యాగరా 9.2-1-53-0; విటోరి 9-0-63-1; తిరిపానో 8.4-1-48-2; చిబాబా 10-2-25-2; క్రెమెర్ 10-0-47-0; సీన్ విలియమ్స్ 3-0-17-0.
జింబాబ్వే ఇన్నింగ్స్: సిబండా (సి) హర్భజన్ (బి) బిన్నీ 20; చిబాబా (సి) రహానే (బి) భువనేశ్వర్ 3; మసకద్జా (సి) తివారీ (బి) అక్షర్ 34; చిగుంబురా నాటౌట్ 104; విలియమ్స్ (బి) అక్షర్ 0; రజా (సి) అక్షర్ (బి) హర్భజన్ 37; ముత్తుబామి (సి) హర్భజన్ (బి) బిన్నీ 7; క్రెమెర్ (సి) బిన్నీ (బి) ధవల్ 27; తిరిపానో నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 251.
వికెట్ల పతనం: 1-16; 2-47; 3-89; 4-94; 5-142; 6-160; 7-246.
బౌలింగ్: భువనేశ్వర్ 10-1-35-1; ధవల్ 9-0-60-1; బిన్నీ 10-0-54-2; హర్భజన్ 10-0-46-1; అక్షర్ పటేల్ 10-1-41-2; మనోజ్ తివారీ 1-0-6-0.