కంటతడి పెట్టిస్తున్న ఫొటో | Sehwag Emotional Post On Odisha Boy Shot By British | Sakshi
Sakshi News home page

అతడిని స్మరించుకోవాలి: సెహ్వాగ్‌ భావోద్వేగ పోస్టు

Published Thu, Nov 14 2019 3:42 PM | Last Updated on Thu, Nov 14 2019 4:40 PM

Sehwag Emotional Post On Odisha Boy Shot By British - Sakshi

న్యూఢిల్లీ: బాలల దినోత్సవం సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ షేర్‌ చేసిన ఫొటో నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. 1938లో బ్రిటీష్‌ వారి తుపాకీ గుళ్లకు బలైపోయిన బాజీ రౌత్‌ అనే బాలుడిని స్మరించుకుంటూ సెహ్వాగ్‌ చేసిన పోస్టు మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. దేశ రక్షణకై బాల్యంలోనే అతడు చూపిన ధైర్యసాహసాలను కొనియాడిన సెహ్వాగ్‌... బాలల దినోత్సవం నాడు బాజీని గుర్తుచేసుకోవాల్సిన ఆవశ్యకతను తన పోస్టులో వివరించాడు. అతి చిన్న వయస్సులోనే ప్రజల రక్షణకై ప్రాణాలు విడిచిన బాజీని భారతదేశపు స్వాతంత్ర్య పోరాటంలో తొలి(పిల్లవాడైన) అమరుడిగా అభివర్ణించాడు.

ఈ మేరకు.. ‘ఒడిశాలోని నీలకాంతపూర్‌కు చెందిన అమరుడు బాజీ రౌత్‌. తనకు పన్నెండేళ్లు ఉన్నపుడు.. ఓ బ్రిటీష్‌ దళం తమను పడవలో ఎక్కించుకుని బ్రాహ్మణి నది అవతలి తీరానికి తీసుకువెళ్లాల్సిందిగా అడిగింది. అయితే అదే దళం తమ గ్రామంలోని ఎంతో మంది అమాయకులను అత్యంత పాశవికంగా చంపిందంటూ వారి గురించి కథలు కథలుగా విన్న బాజీ.. వారు తీరం దాటితే ఇంకెంతో విధ్వంసం సృష్టిస్తారు కదా ఆలోచించాడు. అందుకే తీరం దాటించే ప్రసక్తే లేదని వారితో కరాఖండిగా చెప్పాడు. దాంతో చంపేస్తామంటూ బ్రిటీష్‌ సేనలు బాజినీ భయపెట్టాయి. అయినప్పటికీ బాజీ వారికి తలొగ్గలేదు. వాళ్ల మాటలకు ఎదురుచెప్పాడు. 

ఇంతలో కోపోద్రిక్తుడైన ఓ బ్రిటీష్‌ సైనికుడు బాజీ తల మీద తుపాకీ వెనుక భాగంతో గట్టిగా కొట్టాడు. దాంతో అతడు కిందపడిపోయాడు. అయినప్పటికీ బాజీ మెల్లగా శక్తినంతా కూడగట్టుకుని పైకి లేచి.. తాను బతికున్నంత కాలం వాళ్లను అవతలి తీరానికి చేర్చేది లేదని తేల్చిచెప్పాడు. అప్పుడు వెంటనే ఓ సైనికుడు తన కత్తిని బాజీ తలలోకి దింపగా... మరొకడు ఆ చిన్నారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో బాజీతో పాటు అక్కడే ఉన్న అతడి స్నేహితులు లక్ష్మణ్‌ మాలిక్‌, ఫగూ సాహో, హృషి ప్రదాన్‌, నాటా మాలిక్‌ కూడా మృత్యువాత పడ్డారు. బాలల దినోత్సవం నాడు ఆ ధైర్యశాలికి సెల్యూట్‌ చేస్తున్నా. అత్యంత పిన్నవయసులో అసువులు బాసిన ఆ అమరుడు మరింత గుర్తింపునకు అర్హుడు’ సెహ్వాగ్‌ తన ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చాడు.

ఈ క్రమంలో.. ‘చాలా గొప్ప వ్యక్తిని గుర్తుచేశారు. అతడి త్యాగం మరవలేనిది. ఆ అమాయకపు ముఖం కంటతడి పెట్టిస్తోంది. మీకు ధన్యవాదాలు వీరూ భాయ్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా బాజీ రౌత్‌ ఒడిశాలోని నీలకాంత్‌పూర్‌లో 1926లో జన్మించాడు. పేద కుటుంబానికి చెందిన అతడు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోగా.. అతడి తల్లి ఇళ్లల్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. ఈ క్రమంలో 1938లో బాజీ రౌత్‌ బ్రిటీష్‌ సేనల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement