కేప్‌టౌన్: ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేస్తున్న ‘బాల్ ట్యాంపరింగ్’పై సోమవారం విచారణ ప్రారంభమైంది. ఇందుకోసం నియమితులైన క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ ఇంటెగ్రిటీ లైన్ రాయ్, హై ఫెర్ఫార్మెన్స్ మేనేజర్ పాట్ హోవార్డ్ కేప్‌టౌన్ చేరుకున్నారు. అసలీ ఆలోచన ఎవరిదో తేల్చేందుకు జట్టు బస చేసిన హోటల్‌లోనే స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లను వారు విచారిస్తారు. ప్రధాన కోచ్ డారెన్ లీమన్, సహాయక సిబ్బందిని కూడా ప్రశ్నలడగనున్నారు. బుధవారం నాటికి ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా వచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్... రాయ్‌తో జొహన్నెస్‌బర్గ్‌లో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా విచారణ అంశాలను తెలుసుకుని తదుపరి చర్యలపై ఒక నిర్ణయానికి రానున్నారు. అయితే... పరిణామాలపై కొంత ఓపిక పట్టాలని సీఏ చైర్మన్ డేవిడ్ పీవర్ అభ్యర్థించాడు. మరో 48 గంటల్లో ప్రజలకు పూర్తి వివరాలు చెబుతామని ఆయన పేర్కొన్నారు. తాజా సమాచారం ప్రకారం స్మిత్, వార్నర్‌లను కనీసం ఏడాది పాటు సస్పెండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. నేరుగా ట్యాంపరింగ్‌కు పాల్పడిన బాన్‌క్రాఫ్ట్ పట్ల కూడా సీఏ కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా జట్టులో మార్పులు?
దక్షిణాఫ్రికాతో ఈ నెల 30 నుంచి జరిగే నాలుగో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు ఉంటాయని సమాచారం. బాల్ ట్యాంపరింగ్‌తో స్మిత్ దూరమవడం, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ పైనా చర్యలుంటాయని వార్తలు వస్తుండటంతో వీరి స్థానాలను ఓపెనర్లు రెన్‌షా, జో బర్న్స్, వెటరన్ బెయిలీలతో భర్తీ చేసే అవకాశముంది. దీంతో పాటు ట్యాంపరింగ్‌ను సారథ్య బృంద ఆలోచనగా స్మిత్ చెప్పడం పట్ల... అందులోని సభ్యులైన పేసర్లు హాజల్‌వుడ్, స్టార్క్‌లు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు స్మిత్ వ్యక్తిగత స్పాన్సర్ అయిన శానిటేరియం సంస్థ అతడితో ఒప్పందాన్ని సమీక్షించనున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment