పతకాలతో ప్రియాంక
కటిక పేదరికం. అయినవాళ్లున్నా అనాథలా జీవనం. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరం. కుటుంబ భారం మోయలేక చేతులెత్తేసిన తండ్రి. నిస్సహాయ స్థితిలో ఐదుగురు ఆడపిల్లల్ని స్వచ్ఛంద సంస్థలో చేర్చిన తల్లి... ఇదీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో కిక్ బాక్సింగ్‌లో రాణిస్తోన్న ప్రియాంక జీవితం. కడుపునిండా తిండి లేకున్నా అత్యున్నత శిఖరాలకు చేరాలన్న ఆశయాన్ని వీడలేదు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదంటూ క్రీడల్లో సత్తా చాటుతోంది. అమ్మాయిలు ఎవరికీ తీసిపోరని రుజువుచేస్తూ సాహసోపేతమైన కిక్ బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకొని ముందడుగు వేస్తోంది.
బన్సీలాల్‌పేట్: హైదరాబాద్ వీఎస్‌టీ సమీపంలోని నాగమయ్య కుంట మురికివాడలో జన్మించిన ప్రియాంక జీవితం కన్నీటి పర్యంతం. సంగీత, రాజేందర్ దంపతులకు కలిగిన ఐదుగురు ఆడ సంతానంలో ప్రియాంక నాలుగో అమ్మాయి. ఆడపిల్లలు భారమని భావించిన తండ్రి రాజేందర్ ఇల్లు విడిచి వెళ్లిపోవడంతో ఆ కుటుంబం కోలుకోలేకపోయింది. అప్పటికే పేదరికంలో మగ్గిపోతున్న తల్లి సంగీత నిస్సహాయురాలై పిల్లలందరినీ చిన్నతనంలోనే స్వచ్ఛంద సంస్థలో చేర్చింది. వీరికి అఫ్జల్‌గంజ్‌లోని అఫ్సా రెయిన్‌బో హోమ్ ఆశ్రయం ఇచ్చింది. ప్రస్తుతం ఇదే ఆశ్రమంలో తలదాచుకుంటోన్న ప్రియాంక చాదర్‌ఘాట్‌లోని డీఆర్ జిందాల్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోంది.
రెజ్లింగ్ నుంచి కిక్‌బాక్సర్‌గా...
ప్రియాంక కిక్ బాక్సర్‌గా ఎదగడం వెనుక కోచ్‌లు అక్రముల్లా, శ్రీనివాస్‌ల ప్రోత్సాహం ఉంది. చిన్నప్పటి నుంచి క్రీడల్లో రాణించే ప్రియాంక తొలుత రెజ్లింగ్ వైపు ఆసక్తి చూపించింది. అయితే బెల్ట్ రెజ్లింగ్‌లో వయసు సరిపోకపోవడంతో అర్హత సాధించలేకపోయింది. దీంతో కోచ్‌లు ఆమెను కిక్ బాక్సింగ్ వైపు ప్రోత్సహించారు. ప్రాణాలను పణంగా పెట్టే కిక్ బాక్సింగ్‌లో రాణించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. కానీ ఎలాగైనా ఉన్నత స్థాయికి చేరుకోవాలనే తపనతో ఆమె కిక్ బాక్సింగ్‌లో అడుగుపెట్టింది.
ఆదిలోనే బంగారు పతకం...
కిక్ బాక్సింగ్‌లో అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే ప్రియాంక జాతీయ స్థాయిలో రాణించింది. ఇటీవల ఎల్బీ స్టేడియంలో జరిగిన జాతీయ కిక్ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణాన్ని సాధించింది. 48 కేజీల వెయిట్ కేటగిరీలో మధ్యప్రదేశ్ క్రీడాకారిణిని ఓడించి ప్రియాంక విజేతగా నిలిచింది.
పోలీస్‌గా ఎదగాలనే కాంక్ష...
సమాజాన్ని ప్రక్షాళన చేసేందుకు అవకాశం ఉన్న పోలీస్ అధికారిణిగా ఎదగడమే తన లక్ష్యమని ప్రియాంక చెబుతోంది. అందుకు అనుగుణంగానే క్రీడలతో పాటు, చదువులోనూ రాణిస్తోంది. అఫ్సా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న రెయిన్‌బో హోమ్ తనను అక్కున చేర్చుకుని తన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతోందని ఆమె చెప్పింది. ఆ సంస్థ ప్రేమను జీవితాంతం గుండెల్లో నిలబెట్టుకుంటానని ప్రియాంక కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసింది.
నిస్సహాయులకు అండగా ఉంటాం: అఫ్సా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
నగరంలోని నిరుపేదలకు ఆశ్రయాన్ని కల్పించి వారి జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అఫ్సా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. చదువుతో పాటు ఆసక్తి ఉన్న రంగాల్లో అవసరమైన శిక్షణను ఇప్పించడం ద్వారా మురికివాడల్లోని పేద యువతీ యువకులు అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా తమ సంస్థ చేయూతనిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment