వార్నర్ విశ్వరూపం
హైదరాబాద్:సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ విశ్వరూపం ప్రదర్శించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో వార్నర్ బౌండరీలతో చెలరేగిపోయాడు. అటు ఫాస్ట్ బౌలర్లు, ఇటు స్పిన్నర్లు అని కనికరం లేకుండా పరుగుల మోత మోగించి శతకం నమోదు చేశాడు. 59 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 126 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా సన్ రైజర్స్ 210 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్ రైజర్స్ ఆది నుంచి దూకుడును కొనసాగించింది. డేవిడ్ వార్నర్-శిఖర్ ధావన్ లు ఇన్నింగ్స్ ను దాటిగా ఆరంభించారు. ఒకవైపు శిఖర్ సమయోచితంగా బ్యాటింగ్ చేస్తే, మరొకవైపు వార్నర్ బ్యాట్ ను ఝుళిపించాడు. ఈ క్రమంలోనే 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన వార్నర్..ఆపై మరో 23 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసకున్నాడు. అతనికి జతగా శిఖర్ ధావన్(29) ఫర్వాలేదనిపించాడు. ఈ జోడి తొలి వికెట్ 139 పరుగులు జోడించిన తరువాత శిఖర్ అవుటయ్యాడు. అనవసరపు పరుగు కోసం యత్నించిన శిఖర్ ను కుల్దీప్ యాదవ్ రనౌట్ చేశాడు. దాంతో 12.3 ఓవర్ల వద్ద సన్ రైజర్స్ తొలి వికెట్ ను కోల్పోయింది.
శిఖర్ అవుటైన తరువాత సెంచరీ చేసిన మంచి ఊపుమీద డేవిడ్ వార్నర్ కాస్త జోరు తగ్గించాడు. అయితే పదిహేను ముగిసిన తరువాత వార్నర్ మరోసారి రెచ్చిపోయాడు. సునీల్ నరైన్ వేసిన 16 ఓవర్ లో హ్యాట్రిక్ ఫోర్ల సాధించి స్కోరు బోర్డులో అమాంతం వేగం పెంచాడు. కాగా, పదిహేడో ఓవర్ రెండో బంతిని భారీ షాట్ కు యత్నించిన వార్నర్ అవుటయ్యాడు. దాంతో 171 పరుగుల వద్ద సన్ రైజర్స్ రెండో వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత కేన్ విలియమ్సన్(40 ;25 బంతుల్లో) రాణించగా, యువరాజ్ సింగ్(6 నాటౌట్; 6 బంతుల్లో) బ్యాట్ నుంచి మెరుపులేమీ రాలేదు. చివరి ఓవర్లలో స్కోరు బోర్డులో వేగం తగ్గడంతో సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.