ప్రోత్సాహానికి చాలా సంతోషం!
మిథాలీ రాజ్ వ్యాఖ్య ∙కారు బహుమతిగా అందుకున్న కెప్టెన్
హైదరాబాద్: ప్రపంచ కప్‌లో ఫైనల్ చేరిన అనంతరం అన్ని వైపుల నుంచి తమకు అందుకున్న ప్రోత్సాహకాలపై భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు రావడం మంచి పరిణామమని ఆమె చెప్పింది. భారత క్రికెట్ జూనియర్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్, మిథాలీ రాజ్‌కు మంగళవారం ప్రత్యేకంగా బీఎండబ్ల్యూ 320డి సిరీస్ కారును బహుమతిగా అందజేశారు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచినందుకు ఆమెకు ఈ కానుక ఇస్తున్నట్లు చాముండి చెప్పారు.
మిథాలీ కెరీర్ ఆరంభంలో కూడా ఆయన ఇదే తరహాలో కారును బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మిథాలీ మాట్లాడుతూ ‘ఆటగాళ్లకు ఈ తరహా ప్రోత్సాహకాలు ఉత్ప్రేరకంగా పని చేస్తాయి. క్రీడాకారులకు చాముండి ఇస్తున్న మద్దతు అమూల్యం. గతంలో కూడా అనేక సార్లు ఆయన గిఫ్ట్‌గా ఇచ్చిన బ్యాట్‌లతో భారీగా పరుగులు సాధించాను’ అని గుర్తు చేసుకుంది. మరోవైపు మ్యాక్సీ విజన్ సంస్థ జీవితకాలం మిథాలీ కుటుంబానికి ఉచిత చికిత్స అందించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో మ్యాక్సీ సంస్థ ప్రతినిధి డాక్టర్ వెల్లా, బయోలాజికల్ ఇవాన్స్ ఎండీ మహిమా దత్తా తదితరులు పాల్గొన్నారు.