భారత మహిళల క్రికెట్ జట్టు టి20 ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయి ఉండవచ్చు. కానీ గత కొంత కాలంగా జట్టు ఆటతీరులో వచ్చిన మార్పులు మాత్రం అనూహ్యం. సాంప్రదాయ ధోరణిలో కాకుండా దూకుడు పెంచి సమకాలీన టి20 టీమ్‌గా మన జట్టు ఎదగగలిగింది. ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా జట్టులో అందరు ప్లేయర్లు తమ ఆటతో నమ్మకాన్ని కలిగించగలిగారు. దీని వెనక ఉన్నది జట్టు కోచ్ వూర్కేరి వెంకట్ (డబ్ల్యూవీ) రామన్. శిక్షకుడిగా గతంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ మాజీ క్రికెటర్ 14 నెలల తక్కువ వ్యవధిలోనే మహిళల జట్టుపై కూడా తన ముద్ర వేయగలిగారు. వరల్డ్ కప్‌లో జట్టు ప్రదర్శనను విశ్లేషించడంతో పాటు జట్టు భవిష్యత్తుకు సంబంధించి పలు అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. విశేషాలు రామన్ మాటల్లోనే....
స్మృతి, హర్మన్ వైఫల్యాలపై...
ఇద్దరు స్టార్ బ్యాటర్లు టోర్నీ మొత్తం విఫలం కావడం దురదృష్టకరం. అయితే అలా జరిగినా జట్టు విజయాలు సాధించగలిగిందంటే అది సానుకూల అంశం. క్రీజ్‌లో నిలబడిపోవడంకంటే ఒక భారీ షాట్ ఆడి హర్మన్ తిరిగి వచ్చేయడమే మంచిదని భావించా. ఎందుకంటే ఆమె అలా చేస్తే ప్రత్యర్థులు మానసికంగా పైచేయి సాధిస్తారు. ఆమె తర్వాత వచ్చే మన అమ్మాయిలేమో హర్మనే ఆడలేకపోతోంది మనమేం ఆడగలం అనే ధోరణితో మైదానంలో దిగుతారు. అది మంచిది కాదు. అయితే హర్మన్ సాధ్యమైనంతగా ప్రయత్నించింది. అయితే అనుభవం లేని ఒక జట్టును నడిపిస్తూ వ్యక్తిగతంగా కూడా విఫలమవుతూ ఆమె తీవ్ర ఒత్తిడిని అనుభవించింది.
కోచ్‌గా పని చేసే శైలిపై...
నా దృష్టిలో కోచ్ అనేవాడు ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌కు పని చేసే సర్వీస్ ఇంజినీర్‌లాంటివాడు. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని, అన్నింటినీ చక్కబెట్టి ఇవ్వడమే నా బాధ్యత. ఆపై ఒక పైలెట్‌లాగా మైదానంలో కెప్టెన్ జట్టును నడిపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో బయటి నుంచి పరిశీలించడమే నేను చేస్తాను. మ్యాచ్‌కు ముందే ఆటగాళ్లతో వివరంగా మాట్లాడి వారు మనసులో ఏదైనా సందేహాలు ఉంటే వాటిని తీర్చి ఆత్మవిశ్వాసంతో గ్రౌండ్‌లోకి అడుగు పెట్టేలా చేయగలను. ఇప్పటి వరకు కోచ్‌గా నేను ఇలాగే పని చేస్తున్నాను.
జట్టు ప్రదర్శనపై...
వరల్డ్‌కప్‌కంటే ముందు మేం ముక్కోణపు టోర్నీ కూడా ఆడాం. ఈ రెండు టోర్నమెంట్‌లను కలిసి చూస్తే ఆస్ట్రేలియాలాంటి జట్టును రెండు సార్లు, మహిళల క్రికెట్‌లో అతి పటిష్టమైన ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లను కూడా ఓడించగలిగాం. మా అమ్మాయిల ప్రదర్శన పట్ల చాలా గర్వపడుతున్నాను. మా బలం ఏమిటో గట్టిగా నమ్మి దాని ప్రకారం ఆడటం వల్లే ఇది సాధ్యమైంది. సరిగ్గా చెప్పాలంటే గతంలో ఈ జట్లతో మ్యాచ్‌కు ముందు ప్లేయర్లు ఒక పెద్ద సవాల్ ఎదురైనట్లుగా భావించేవారు. ఇప్పుడు అలా కాదు. ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించగలమనే ఆత్మవిశ్వాసం వచ్చింది. అదే విజయానికి తొలి మెట్టు. మెగా టోర్నీ జరిగిన సమయంలో నేను ఒక్కసారి కూడా ‘వరల్డ్ కప్’ అనే మాటను ఉచ్ఛరించలేదు. ఒక టోర్నీ అని మాత్రమే అన్నాడు. ఎందుకంటే ప్రపంచకప్ అనే వారిపై అనవసరపు ఒత్తిడి పెంచవచ్చు. రాబోయే వన్డే వరల్డ్ కప్ కోసం కూడా నాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. టోర్నీకి ఆరు నెలల ముందుగా పూర్తి స్థాయిలో జట్టును ఎంపిక చేసుకొని వారితో సన్నాహాలు సాగించాలి. టి20 ప్రపంచకప్‌లో ఆడినవారే కాకుండా వన్డేలకు తగిన ప్లేయర్లను తీసుకోవడం కూడా కీలకం. రాబోయే చాలెంజర్ టోర్నీ అందుకు కావాల్సిన అవకాశమిస్తుంది.
ఫైనల్లో ప్రేక్షకులు, ఒత్తిడి గురించి...
మెల్‌బోర్న్ మైదానంలో దాదాపు లక్ష మంది ప్రేక్షకులు ఉంటారనే విషయం నాకు తెలుసు. కానీ ఆ సమయంలో ఎలా ఉండాలో, ఏం చేయాలో నేను చెప్పలేదు. ఎందుకంటే ఆ వాతావరణం, జోష్ అంతా అనుభవిస్తేనే అర్థమవుతుంది తప్ప ఇలా ఉంటుందని మనమేమీ చెప్పలేం. ఇలాంటి స్థితిలో కూడా బంతిపైనే దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. లేదంటే ప్రేక్షకుల చేతుల్లోనే ఓడిపోతాం. అయితే మా పరాజయానికి ప్రేక్షకుల సంఖ్య లేదా అక్కడి వాతావరణం కారణం కానే కాదు. నేను అలాంటి సాకులు చెప్పను. అయితే ఫైనల్‌కు ముందు వారం రోజుల పాటు మ్యాచ్ లేకుండా విరామం రావడం మమ్మల్ని దెబ్బ తీసిందనేది మాత్రం వాస్తవం. ఒక యువ జట్టు ఇన్ని రోజులు ఆటకు దూరంగా ఉండి మళ్లీ ఆటలోకి వచ్చి నేరుగా ఫైనల్ ఆడటం మానసికంగా అంత సులువు కాదు. నలుగురు స్పిన్నర్లతో ఆడటం ఎప్పుడైనా దెబ్బ కొట్టవచ్చని ఒక దశలో భయపడ్డాను. చివరకు ఫైనల్లోనే అది జరిగింది. మనకు అందుబాటులో ఉన్న వనరులతోనే జట్టును రూపొందించాలి కదా. కొన్ని ప్రణాళికలు ఫైనల్లో పని చేయలేదు. అయితే ఆటలంటే ఇలాగే ఉంటాయి. వాటిని మరచి ముందుకు సాగాలి.
టీనేజర్ షఫాలీ వర్మ గురించి...
బౌలర్లపై విరుచుకుపడటమే షఫాలీ శైలి. దాదాపు అన్ని మ్యాచ్‌లలో ఆమె అదే చేసింది. షఫాలీతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నాకర్థమైంది. నిజంగా బ్యాటింగ్ గురించి ఆమెకు నేను సూచనలేమీ చేయను. జట్టు సమావేశాల తర్వాత ఆమెతో విడిగా మాట్లాడుతూ అక్కడ చెప్పిందంతా నీకు కాదులే. నువ్వు ఎలా ఆడాలనుకుంటే అలా ఆడు అనేవాడిని. 16 ఏళ్ల అమ్మాయితో అలాగే చెప్పాలి. అవసరం లేకపోయినా మనసులో వేరే ఆలోచనలు ఎందుకు చొప్పించాలి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు రోజు ప్రాక్టీస్ సెషన్‌లో ఆమె ఒక్క షాట్ కూడా గాల్లోకి కొట్టకుండా ఆడింది. చూశారా నేను ఎంత పద్ధతిగా ఆడానో అని నాతో చెప్పింది కానీ నేను పట్టించుకోలేదు. తర్వాతి రోజు ఏం చేస్తుందో నేను వేచి చూశా. అన్ని షాట్లు గాల్లోకి వెళ్లాయి. నాలుగు సిక్సర్లు వచ్చేశాయి (ఆ మ్యాచ్‌లో 17 బంతుల్లో 39). నాకు నవ్వొచ్చింది. ఆమె ఆటలో చాలా వినోదం లభించింది.
అమ్మాయిల ప్రతిభ గురించి...
మా టీమ్ సగటు వయసు 22 ఏళ్లు! ఆస్ట్రేలియా గడ్డపై చూపిన ప్రదర్శనను కొనసాగించగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆడినవారిలో ఆత్మవిశ్వాసం పెరగడమే కాదు, వారిని చూసినవారు కూడా స్ఫూర్తి పొందేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుంది. ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీ జట్టులో ముగ్గురు టీనేజర్లు, అనుభవం లేని ఇద్దరు యువ ప్లేయర్లను ఎంపిక చేసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. అయితే ప్రతిభ ఉంటే వేదిక ఎంత పెద్దదైనా భయపడకుండా ఆడవచ్చని వారు నిరూపించారు. కొన్ని చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకుంటే ఈ జట్టు మున్ముందు మరింత బలమైన జట్టుగా ఎదగడం ఖాయం. సరిగ్గా చెప్పాలంటే పేస్ బౌలింగ్ దళాన్ని పటిష్ట పరచుకోవాల్సి ఉంది. ఇది మాకు బలహీనతగా కనిపించింది కాబట్టి పేసర్లను తీర్చిదిద్దడం ముఖ్యం. నిజాయితీగా చెప్పాలంటే మన అమ్మాయిలు శారీరకంగా కొంత బలహీనంగానే ఉన్నారు. వారు తమ ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ పెట్టి బలంగా తయారవడంతో పాటు విరామం లేకుండా బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. గతంతో పోలిస్తే వేగం, చురుకుదనం కొంత పెరిగినా అది ఇంకా మెరుగవ్వాలి. దీనికి కొంత సమయం పట్టవచ్చు కానీ భవిష్యత్తులో ఫలితాలు బాగుంటాయి.
నాణ్యత లోపిస్తే పరిస్థితి ఘోరం...
మహిళల ఐపీఎల్ విషయంపై తొందరపడవద్దని నా హెచ్చరిక! నా అభిప్రాయం ప్రకారం ఇప్పటికిప్పుడు అనవసరం. ప్రస్తుతం మన మహిళా క్రికెటర్లు పూర్తి స్థాయి (ఎనిమిది జట్లతో) ఐపీఎల్‌కు సిద్ధంగా లేరు. ఐపీఎల్ ఆలోచన మంచిదే కావచ్చు. కానీ వాటిని అమలు చేయడం అంత సులువు కాదు. ఇప్పటికిప్పుడు హడావిడిగా ఐపీఎల్ అని మొదలు పెట్టి అందులో నాణ్యత లోపిస్తే పరిస్థితి ఘోరంగా మారిపోతుంది. పురుషుల ఐపీఎల్ కూడా ఆరంభమైనప్పుడు ఇంత సూపర్ సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. నాకు తెలిసి ముందుగా పెద్ద సంఖ్యలో ప్లేయర్లకు గుర్తించి జట్లను తయారు చేయడం ముఖ్యం. నా అవగాహన ప్రకారం ఈ విషయంలో తొందర పడాల్సిన అవసరం లేదు. ఇక ప్లేయర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ ఎలా అని ప్రశ్నిస్తే... రాబోయే రోజుల్లో భారత్ ‘ఎ’, అండర్–23 టోర్నీలు నిర్వహించవచ్చు. అండర్–19 ప్రపంచకప్ ప్రతిపాదన కూడా ఉంది కాబట్టి అమ్మాయిలకు పెద్ద సంఖ్యలో క్రికెట్ ఆడే, తమ సత్తాను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత ఏదో రోజు ఐపీఎల్ రావచ్చేమో. హడావిడిగా కాకుండా క్రమక్రమంగా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లాలి. ఈసారి నాలుగు జట్లు అంటున్నారు మంచిదే. ఒక్కో జట్టు మరో టీమ్‌తో కనీసం రెండు సార్లయినా తలపడితే బాగుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment