న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత విశ్వవిద్యాయాల్లో ఒకటైన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో మహిళలకు స్వేచ్ఛాయుత, సురక్షిత వాతావరణం కరువయింది. గతంలో ఓ యువకుడు తరగతి గదిలోనే విద్యార్థినిపై గొడ్డలితో దాడి చేసినప్పటికీ యాజమాన్యం భద్రతపై పెద్దగా దృష్టి సారించలేదు. తాము లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్టు 53 శాతం మంది విద్యార్థులు సెం టర్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అండ్ సెంటర్ ఆఫ్ జర్మన్ స్టడీస్ నిర్వహించిన అంతర్గత సర్వేలో వెల్లడించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ సర్వే ప్రశ్నావళికి 529 మంది విద్యార్థినులు స్పందించారు. తాము ‘సహచరులు/ప్రేమికుడితో ఇబ్బందులు’ ఎదుర్కొన్నట్టు ప్రతి ఐదుగురిలో ఒక విద్యార్థిని పేర్కొంది.
అప్పుడప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నామని దాదాపు 53 శాతం మంది వెల్లడించారు. గతంలో ఒక విద్యార్థిని జేఎన్‌యూలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మనస్తాపం కలిగించినట్టు 96 శాతం మంది పేర్కొన్నారు. అయితే జేఎన్‌యూలో సురక్షిత వాతావరణం ఎందుకు కరువవుతోందనే ప్రశ్నకు చాలా జవాబులు వినిపిస్తున్నాయి. సోషల్ మెడిసిన్‌లో ఎంఫిల్ చేస్తున్న ఒక విద్యార్థి స్పందిస్తూ ‘సర్వే ఫలితాలను నేను కూడా విశ్వసిస్తున్నాను. గత కొన్నేళ్లుగా జేఎన్‌యూ క్యాంపస్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బయటి వ్యక్తులు సులువుగా క్యాంపస్‌లోకి చొరబడుతున్నారు. వారి చూపులు కూడా ఏదోలా ఉంటాయి. జూనియర్లూ అనుచితంగా ప్రవర్తిస్తుంటారు’ అని ఆమె వివరించారు. లైంగిక వేధింపుల నిరోధానికి జేఎన్‌యూ ఏర్పాటు చేసిన కమిటీ పనితీరుపైనా ఆమె పెదవి విరిచారు.
జూనియర్లకు కౌన్సెలింగ్ ఇవ్వకపోవడంతో వారు ఇక్కడికి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. జేఎన్‌యూ స్వేచ్ఛాస్ఫూర్తిని జూనియర్లు అర్థం చేసుకోవడం లేదని వినయ్ కుమార్ అనే పీహెచ్‌డీ విద్యార్థి అభిప్రాయపడ్డాడు. ‘గత ఐదేళ్లుగా నేను క్యాంపస్‌లో ఉంటున్నా. ఇక్కడి వాతావరణం క్రమంగా మారుతోంది. ప్రతి ఒక్కరూ పైచేయి కోసం ప్రయత్నించేవారే! ఫలితంగా విద్యార్థినీవిద్యార్థుల మధ్య అంతరం పెరుగుతోంది. మనది ఇప్పటికీ పితృస్వామ్య వ్యవస్థే కాబట్టి ఇక్కడ కూడా మహిళలు ఇబ్బంది పడుతున్నారు’ అని ఆయన వివరించారు.
సహచరులు/ప్రేమించిన వాళ్లతో ఇబ్బందిపడే విద్యార్థినుల గురించి ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనల్లో విద్యార్థిని బయటికి వచ్చి ఫిర్యాదు చేస్తే తప్ప ఏమీ చేయలేమన్నారు. మగవారిలో ఇప్పటికీ పితృస్వామ్య భావన బలంగా ఉండడమే ఈ సమస్యకు కారణమని విశ్లేషించారు. సర్వే ఫలితాలపై ప్రొఫెసర్ ఆయేషా కిద్వాయ్ స్పందిస్తూ నిజాలు ఎలా ఉన్నా యూనివర్సిటీ అంగీకరిస్తుందని స్పష్టం చేశారు. సురక్షిత వాతావరణం కల్పించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటికే అమల్లో ఉన్న లైంగిక వేధింపుల కమిటీని బలోపేతం చేయడానికి బదులు, కొత్త దానిని ఏర్పాటు చేయడం వల్ల పెద్దగా ఫలితాలు ఉండబోవని విద్యార్థులు అంటున్నారు.
లైంగిక వేధింపులపై నిర్లక్ష్యం
Published Mon, Nov 18 2013 11:42 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement