తమిళనాడు, టీనగర్: అత్యాచారానికి గురైన బాలిక గర్భస్రావానికి అనుమతి నిస్తూ ప్రభుత్వ ఆస్పత్రికి మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాంచీపురానికి చెందిన 14 ఏళ్ల బాలిక అనారోగ్యం కారణంగా ఇంట్లో బాధపడుతూ వచ్చింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్ష జరుపగా గర్భవతి అని తెలిసింది. దీంతో బాలికపై అత్యాచారానికి సంబంధించి కాంచీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బాలికను కాంచీపురం జిల్లా కలెక్టర్ ఎదుట హాజరుపరిచి చెంగల్పట్టులో ఉన్న ఒక హాస్టల్‌లో చేర్చించారు. ఇలా ఉండగా, బాలికకు చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. ఆమెకు 18 వారాల గర్భం ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో బాలిక గర్భస్రావానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కాంచీపురం బాలల సంక్షేమ కమిటీ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ న్యాయమూర్తి డి.రాజా సమక్షంలో విచారణకు వచ్చింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రి ప్రసూతి డాక్టర్ అభిప్రాయాన్ని కోరగా, అందుకు బాలికకు గర్భస్రావం చేయవచ్చునని తెలిపారు. ఈ కేసు గత నెల 25వ తేదీ విచారణకు రాగా బాలిక, ఆమె తల్లి కోర్టులో హాజరయ్యారు. ఆ సమయంలో డాక్టర్ సూచనలను బాలిక తల్లికి, న్యాయమూర్తి తెలిపారు. ఇందుకు బాలిక తల్లి సమ్మతించింది. దీంతో బాలిక గర్భస్రావానికి అనుమతినిచ్చారు. ఈ మేరకు శుక్రవారం న్యాయమూర్తి తగిన వైద్య చికిత్సలతో బాలిక గర్భాన్ని తొలగించాలని చెంగల్పట్టు ఆస్పత్రి డీన్‌కు, ప్రసూతి విభాగం డాక్టర్‌కు ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment