► వ్యవసాయదారులకు రూపే డెబిట్ కార్డులు
► ఫిక్స్‌డ్ డిపాజిట్లకు రూ.8.85 శాతం వడ్డీ సౌకర్యం
► నిబంధనలు లేకుండా రూ.10 లక్షల వరకు ముద్ర రుణాలు
► ఖమ్మంలో త్వరలో మరో రెండు ఎస్బీఐ బ్రాంచ్‌లు
► ఏప్రిల్ నాటికి ఎస్‌బీహెచ్‌లు ఎస్బీఐలోకి విలీనం: సీజీఎం గిరిధర్ కిని
ఖమ్మం వ్యవసాయం: ఎస్బీఐ గృహ నిర్మాణాలకు తక్కువ వడ్డీతో రుణాలను అందజేస్తూ ప్రోత్సహిస్తుందని హైదరాబాద్ సర్కిల్ ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ గిరిధర్ కిని స్పష్టం చేశారు. గురువారం నగరంలోని బస్ డిపోరోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్బీఐ బ్రాంచ్‌ను ఆయన ప్రారంభించారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గృహ నిర్మాణాలకు ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఎస్బీఐ కేవలం 8.65 శాతం వడ్డీతో గృహ నిర్మాణాలకు రుణాలను అందిస్తుందన్నారు.
వ్యవసాయదారులకు రూపే కార్డులు..
వ్యవసాయదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులతో పాటు రూపే కార్డులను కూడా త్వరలో అందజేయనున్నామని తెలిపారు. రూపే కార్డు రైతులకు ఎంతో మేలు చేస్తుందని, ఈ కార్డు ద్వారా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు వంటి వాటిని కొనుగోలులో వినియోగించుకోవచ్చని తెలిపారు. రైతులకు పంట రుణాలతో పాటు ట్రాక్టర్ లోన్స్, అతి తక్కువ వడ్డీతో బంగారంపై రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై తమ బ్యాంక్ 8.85 శాతం వడ్డీని అందజేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ముద్రా’ రుణాలను ఎటువంటి జమానతు లేకుండా రూ. 10 లక్షల వరకు ఇస్తున్నామని ఆయన తెలిపారు.
త్వరలో మరో రెండు బ్రాంచ్‌లు
జిల్లాలో త్వరలో మరో రెండు ఎస్బీఐ బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం, నగరంలోని మమతా మెడికల్ కళాశాల రోడ్‌లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేయనున్నట్ల ఆయన తెలిపారు. తెలంగాణలో వరంగల్ జిల్లా తరువాత ఖమ్మం జిల్లాలో ఎస్బీఐ సేవలు ఎంతగానో ముందంజలో ఉన్నాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఏప్రిల్ నాటికి ఎస్బీహెచ్ బ్యాంక్‌లు విలీనం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ఏప్రిల్ ఆఖరు నాటికి ఎస్బీఐలో విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీంతో ఎస్బీఐ రాష్ట్రంలో అగ్రగామిగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు బ్రాంచ్‌లన్నీ విలీనం అవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్బీఐ తెలంగాణ సర్కిల్ రూ. 3 లక్షల కోట్ల టర్నోవర్‌తో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం నారాయణ రాజా, డీజీఎం భాస్కర్, నూతన బ్రాంచి మేనేజర్ కె.రవీందర్, కార్పొరేటర్లు దోరేపల్లి శ్వేత, కుమ్మరి ఇందిర, నాగండ్ల దీపక్ చౌదరి, పాలెపు రమణ, నవీన్‌కుమార్, ఆర్టీసీ యూనియన్ నాయకులు, ఖాతాదారులు పాల్గొన్నారు.
తక్కువ వడ్డీతో హౌసింగ్ లోన్లు
Published Fri, Feb 24 2017 7:45 PM | Last Updated on Tue, Aug 28 2018 8:04 PM
Advertisement
Advertisement