చెన్నై, సాక్షి ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు డీఎంకే ఆదివారం హైడ్రామానే నడిపింది. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ తన పదవులకు రాజీనామా, కార్యకర్తల ఆందోళన, అంతలోనే ఉపసంహరణ చకచకా సాగి పోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే 35 సీట్లలోనూ, మిత్రపక్షాలు ఐదు సీట్లలోనూ పోటీచేశాయి. పుదుచ్చేరి కలుపుకుని మొత్తం 40 స్థానాల్లో కనీసం ఒక్క స్థానాన్ని కూడా పార్టీ దక్కించుకోలేకపోయింది. రాష్ట్రంలోని 39 స్థానాల్లోకి 37 స్థానాలను అన్నాడీఎంకే ఎగరేసుకుపోగా, మిగిలిన రెండు స్థానాలు బీజేపీ, పీఎంకే దక్కించుకున్నాయి. పైగా అనేక చోట్ల పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని యూపీఏ 1, 2లలో భాగస్వామిగా ఉన్న డీఎంకేకు ఆ పార్టీకి పట్టిన గతే పట్టింది. కాంగ్రెస్ సైతం రాష్ట్రంలో ఘోర ఓటమిని చవిచూసింది.
కేంద్రంలో భాగస్వామిగా ఉండికూడా రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదనే అప్రపదతోపాటూ 2జీ స్పెక్ట్రం కుంభకోణాలు వంటి భారీ అవినీతి డీఎంకేను అప్రతిష్ట పాలుచేసింది. ఇవేగాక శ్రీలంక యుద్ధం సమయంలో తమిళుల ఊచకోత సాగుతున్నా అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే తగిన చొరవచూపలేదు. ఇలా అనేక కారణాలతో ప్రజలకు దూరమైన డీఎంకేకు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరో శరాఘాతంగా మారాయి. పోలైన ఓట్లలో 44 శాతం అన్నాడీఎంకే వైపుఉండడం ద్వారా ప్రజల్లో డీఎంకే మరింత పలుచనై పోయింది. పోయిన ప్రతిష్టను డీఎంకే తిరిగి దక్కించుకునేందుకు ఇప్పట్లో మరోమార్గం లేదు. 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల వరకు ఎదురుచూడాల్సిందే. ఈ రెండేళ్లలో జవసత్వాలు కూడగట్టుకునేందుకు, పార్టీలోనూ, ప్రజల్లోనూ సానుభూతి సంపాదించుకునేందుకు రాజీనామా డ్రామాను ఉపయోగించారు.
చెన్నై గోపాలపురంలోని తండ్రి కరుణానిధి ఇంటికి ఆదివారం ఉదయం 11 గంటలకు స్టాలిన్ వెళ్లారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లేఖను పార్టీ అధినేత కరుణానిధికి అందజేశారు. పార్టీ శ్రేణుల్లోకి రాజీనామా సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా చేరవేశారు. అంతే స్టాలిన్ అనుచరులు గుంపులు గుంపులుగా తయారై గోపాలపురం వద్ద, స్టాలిన్ ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. స్టాలిన్ రాజీనామాను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. రెండు ఇళ్ల ముందు బైఠాయించి హైడ్రామా సృష్టించారు. గోపాలపురం నుంచి కరుణగానీ, స్టాలిన్ తన ఇంటి వద్దగానీ మీడియా ముందుకు రాలేదు. ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియకపోవడంతో మీడియా అటూ ఇటూ పరుగులు పెట్టింది. చివరకు ఏమవుతుందోననే ఉత్కంఠను పార్టీ రేకెత్తించింది.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్టాలిన్ ఇంటివద్ద పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు స్టాలిన్ తన రాజీనామా లేఖను కరుణకు సమర్పించారని తెలిపారు. అయితే ఆ రాజీనామాను పార్టీ ఆమోదించలేదని చెప్పారు. పార్టీ ఓటమికి ఏ ఒక్కరో బాధ్యులు కారని, పైగా రాజీనామాకు ఇది సమయం కాదని కరుణ నచ్చజెప్పారని అన్నారు. స్టాలిన్ వంటి యువకుని సేవలు పార్టీకి ఎంతో అవసరమని, రాజీనామాను ఆమోదించరాదంటూ రాష్ట్రంలోని పార్టీ నేతలంతా తనకు చెప్పినట్లు కరుణ పేర్కొన్నారని ఆయన తెలిపారు. అందుకే రాజీనామా లేఖను ఆమోదించకుండా నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పినట్లు దురైమురుగన్ మీడియాకు వివరించారు. అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గి రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు స్టాలిన్ ప్రకటించారని దురైమురుగన్ ప్రకటించారు. మీడియా వారు కనపడితే చాలు ప్రకటనలు గుప్పించే కరుణ, స్టాలిన్ ఇంత హైడ్రామా జరుగుతున్న వెలుపలకు రాలేదు.
కరుణతోనే పార్టీ భవిష్యత్తు : అళగిరి
డీఎంకే పగ్గాలు తిరిగి కరుణానిధి చేతికి వచ్చినపుడే పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ బహిష్కృత నేత, కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి మీడియాతో వ్యాఖ్యానించారు. పేరుకు కరుణైనా పార్టీపై పెత్తనమంతా చిన్నతలైవర్ స్టాలిన్‌దేనని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో మీరు చెప్పినట్లుగానే డీఎంకేకు ఫలితాలు వచ్చాయని మీడియా ప్రశ్నించగా, ఈ ప్రశ్నను పార్టీ అధినేతనో, చిన్ననేతనో, లేదా పార్టీ కేంద్ర కార్యాలయంలో మూలదాక్కుని ఉండే మరోనేతనో అడగండని బదులిచ్చారు. ఎప్పటికైనా తన నాయకుడు కరుణానిధి మాత్రమేనని పునరుద్ఘాటించారు.
డీఎంకేలో హైడ్రామా
Published Sun, May 18 2014 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM
Advertisement