భివండీ, న్యూస్‌లైన్: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి పది రోజులు కావస్తున్నా భివండీ లోక్‌సభ నియోజకవర్గంలో కీలక పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ఇంతవరకు ప్రకటించలేకపోయాయి. కాంగ్రెస్ మాత్రం గురువారం సాయంత్రం తమ పార్టీ తరఫున లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించింది. కాగా, బీజేపీలాంటి ప్రధాన పార్టీతో పాటు ఎమ్మెన్నెస్ కూడా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పట్టణంలో బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్న సీనియర్ నాయకులు అయోమయానికి గురవుతున్నారు. ఐదేళ్ల కిందట భివండీ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. దీని హద్దులో కల్యాణ్(పశ్చిమం), ముర్బాడ్, శాపూర్, భివండీ (తూర్పు), భివండీ (పశ్చిమం), భివండీ(రూరల్) ఇలా ఆరు అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. భివండీ(తూర్పు), శాపూర్ అసెంబ్లీ నియోజక వర్గాలలో శివసేన, భివండీ రూరల్ నియోజక వర్గంలో బీజేపీ, కల్యాణ్ (పశ్చిమ) నియోజకవర్గంలో ఎమ్మెన్నెస్, భివండీ (తూర్పు)లో సమాజ్‌వాదీ పార్టీలు అధికారంలో ఉన్నాయి.
అయితే భివండీ లోక్‌సభ నియోజక వర్గంలో శివసేన, బీజేపీల బలం అధికంగా ఉంది. ఇక్కడి నుంచి పోటీచేసేందుకు మాజీ మంత్రి జగన్నాథ్ పాటిల్, సిట్టింగ్ ఎమ్మెల్యే మంగళ్‌ప్రభాత్ లోఢా, కార్పొరేషన్ ఘట్‌నేత నీలేష్ చౌదరి అసక్తితో ఉన్నారు. కాని పార్టీ నాయకులు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అభ్యర్థుల్లోనే కాక కార్యకర్తల్లో సైతం అసంతృప్తి నెలకొంది. పట్టణ బీజేపీ అధ్యక్షుడు మహేష్ చౌగులే, శ్యామ్ అగర్వాల్, ఘట్ నేత నీలేష్ చౌదరి తదితరులు పార్టీ ప్రధాన కార్యాలయంలో తిష్ట వేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ పార్టీ సైతం సై అంటోంది.
అదేవిధంగా సమాజ్‌వాదీ పార్టీ నుంచి అబూ ఆజ్మీ బరిలో దిగడానికి ఆసక్తితో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే రషీద్‌తాహిర్ మోమిన్‌తోపాటు ఇతర సీనియర్ నాయకులకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ప్రచారానికి తగినంత సమయం కావాల్సి ఉండగా అభ్యర్థుల ఎంపికలో పార్టీలన్నీ ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండటంపై ఆశావహుల్లో గందరగోళం నెలకొంది. కాగా, కాంగ్రెస్ మాత్రమే గురువారం భివండీ తరఫున విశ్వనాథ్ పాటిల్ పేరును ప్రకటించడం విశేషం.
కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల రెండవ జాబితా విడుదల
కాంగ్రెస్ లోకసభ అభ్యర్థుల రెండవ జాబితాను ప్రకటించింది. ఇందులో రాష్ట్రానికి చెందిన ఏడుగురు అభ్యర్థులున్నారు. వీరిలో ప్రధానంగా అఖిల భారతీయ యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడైన ఎమ్మెల్యే రాజీవ్ సాతవ్‌కు హింగోలి నుంచి టికెట్ ఇచ్చారు. ఇంరా హిదాయత్ పటేల్ (అకోలా), సాగర్ మెఘే (వర్ధా), డాక్టర్ నామ్‌దేవ్ ఉసెండి (గడ్‌చిరోలి-చిమూర్ ), విలాస్ ఔతాడే (జాల్నా), విశ్వనాథ్ పాటిల్ (భివండీ), కల్లప్పా ఆవాడే (హాతకణంగలే)లు ఉన్నారు.
భివండీ.. అభ్యర్థులు ఎవరండీ..!
Published Thu, Mar 13 2014 10:41 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement