- ఓ వైపు వరుణుడి బీభత్సం
- మరో వైపు తాగునీటికి కటకట
- ఉత్తర కర్ణాటకను కుదిపేసిన భారీ వర్షాలు
- ప్రభుత్వ గణాంకాల మేరకు 53 మంది మృతి
- లక్షల హెక్టార్లలో పంట నష్టం
- 17 జిల్లాల్లో తీవ్ర నీటి ఎద్దడి
- సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన ‘ఎన్నికల కోడ్’
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో అతివృష్టి అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించగా మరి కొన్ని ప్రాంతాల్లో నీటి చుక్క కూడా కనిపించని పరిస్థితులు దాపురించాయి.రాష్ర్టంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో నష్టపరిహారం కూడా చెల్లించలేని సంకటస్థితి ఏర్పడింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఉత్తర కర్ణాటక ప్రాంతంలో రెండు నెలల కాలంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలకు 53 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 33 మంది పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయినవారే.
ఇక అదుపు తప్పి కురిసిన భారీ వర్షాలకు 2,08,547 హెక్టార్లలో పంట మొత్తం నీటి పాలైంది. ఇందులో ఎక్కువ శాతం ఉద్యాన పంటలు కావడంతో రైతులు ఆర్థికంగా ఎక్కువ నష్టపోయినట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖ అంచనా వేసింది. 800 పశువులు ప్రాణాలు కోల్పోయాయి. దీంతో పాడి రైతు పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. మరోవైపు 1,072 ఇళ్లు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ గణాంకాలకు దాదాపు రెట్టింపు సంఖ్యలో నష్టం సంభవించి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున బాధితులకు నష్ట పరిహారం ప్రకటించడం కుదరక పోవడం మరింత శోచనీయం.
గుక్కెడు నీటి కోసం...
రాష్ట్రంలో 176 తాలూకాలకు గాను 125 తాలూకాల్లో కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారు. ఇందులో 17 జిల్లాల్లో 471 గ్రామాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికీ వీరు నీటి ట్యాంకర్లపైనే ఆధారపడి ఉన్నారు. కరువు పీడిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎన్నికల కోడ్ అడ్డంకి కాకపోయినా, సంబంధిత అధికారులు అందరూ ఎన్నికల విధుల్లో ఉండటంతో స్వాంతన చేకూర్చలేని పరిస్థితి ఏర్పడిందనే వాదన వినిపిస్తోంది.
గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్రంలో కేవలం ఆరు జిల్లాల్లో మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 17కు పెరిగింది. అంటే రాష్ర్టంలో ఈ ఏడాది నీటి ఎద్దడి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నిబంధనలను కొంత వర కు సడలించాలని కోరుతూ ప్రధాన కార్యదర్శి కౌషిక్ ముఖర్జీ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా ‘కోడ్’ నిబంధనలను సడలిస్తే అభివృద్ధి, పరిహారంతోపాటు పాలనా వ్యవహారాలు కొంత వర కు సమర్థంగా నిర్వహించుకోవడానికి వీలవుతుందని ఆ లేఖలో పేర్కొనట్లు సమాచారం.