నోట్ల కష్టాల నుంచి ఊరట
విజయవాడ: పాత పెద్ద నోట్ల ఉపసంహరణతో నోట్ల కష్టాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ వాసులకు ఊరట లభించనుంది. నగదు మార్పిడి కోసం అష్టకష్టాలు పడుతున్న ప్రజలను ఆర్ బీఐ కనికరించింది. ఆంధ్రప్రదేశ్ కు రూ. 2 వేల కోట్ల నగదు పంపించింది. ఈ నగదు ఆదివారం రాష్ట్రానికి చేరుకుంది. రూ. 400 కోట్ల విలువైన 100 నోట్లు, రూ.1600 కోట్ల విలువైన కొత్త రూ. 2 వేల నోట్లను రాష్ట్రానికి ఆర్బీఐ పంపించింది. అయితే కొత్తగా చెలామణిలోకి వచ్చిన రూ. 500 నోట్లు ఇంకా రాష్ట్రానికి పంపించకపోవడంతో నోట్ల కష్టాలు కొనసాగనున్నాయి.
సరిపడా నగదు లేకపోవడంతో బ్యాంకులు, పోస్టాఫీసులు.. సామాన్యులకు నోట్లు అందించలేకపోతున్నాయి. ఏటీఏంలోనూ డబ్బు లేకపోవడంతో జనం బాధలు వర్ణణాతీతం. రోజంతా క్యూలో నిలబడినా అవసరాలకు సరిపడా డబ్బు దొరక్కపోవడంతో మామూలు జనం కుదేలైపోతున్నారు. కొత్త రూ. 500 నోట్లు కూడా ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో కష్టాలు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీకి ఆర్బీఐ భారీ మొత్తంలో నగదు పంపడం సామాన్యులకు ఊరట కలిగించనుంది. రూ. 500 నోట్లు కూడా పంపించి తమ వెతలు తీర్చాలని జనం కోరుకుంటున్నారు.