రాష్ట్రానికి 2 వేల కోట్లు వచ్చాయి
- ముఖ్యమంత్రి చంద్రబాబు
- నేడు ఎస్‌ఎల్‌బీసీతో ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి: పన్నెండు రోజులైనా నోట్ల మార్పిడి సమస్య కొలిక్కి రావడం లేదని, తనకు చాలా అసహనంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నోట్ల మార్పిడిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆదివారం తన నివాసం నుంచి సీఎం టెలికాన్ఫరెన్‌స నిర్వహించారు. ఇందులో ఆర్‌బీఐ, రాష్ట్ర స్థారుు బ్యాంకర్ల కమిటీ, ఆర్థిక శాఖ అధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి మరో రెండు వేల కోట్ల రూపాయలు వచ్చాయని, ఇందులో రూ.100 నోట్లే రూ.400 కోట్లు ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా సోమవారం నుంచి ప్రజలకు కొంత మేర ఉపశమనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు.
బ్యాంకులకు, ప్రజలకు మధ్య కమాండ్ కంట్రోల్ రూంలు వారధిగా పనిచేయాలని సూచించారు. నగదు అధికంగా ఉన్న బ్యాంకులు.. ఇతర బ్యాంకులకు నగదు అందించి ప్రజలు ఇబ్బందులు పడకుండా సర్దుబాటు చేయాలని సీఎం కోరారు. టికెట్ కౌంటర్ల వద్ద ఈ పాస్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆర్టీసీకి సూచించారు. మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ శిక్షణకు విద్యార్థుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు ద్వారా వారి తల్లిదండ్రులు కూడా ఏ విధంగా వాడాలో తెలుసుకుంటారని చెప్పారు. సమన్వయంతో పనిచేయని, సహకారం అందించని బ్యాంకర్లకు నోటీసులు ఇస్తామని చెప్పారు. సోమవారం రాష్ట్ర స్థారుు బ్యాంకర్ల కమిటీతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.