ప్రత్యేక హోదా వేస్ట్
- హోదా కోసం ఎవరూ పట్టు పట్టొద్దు
- విశాఖ ఎంవోయూలన్నీ అమలుకావు..: సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవనీ, హోదా కోసం ఎవరూ పట్టు పట్టొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. హోదా కంటే ఎక్కువ ప్రయోజ నాల వచ్చేప్పుడు ప్యాకేజీ తీసుకుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ 1బీ వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయంతో అక్కడ మన వారికి ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అక్కడ పోయే ఉద్యోగాలను రాష్ట్రంలో సృష్టించాల్సి ఉందన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు కిసాన్‌సెజ్‌లో గమేసా కంపెనీ స్థాపించిన పవన విద్యుత్ ఉత్పత్తి విడిభాగాల తయారీ కర్మాగారాన్ని, పరిపాలనా భవనాన్ని సీఎం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
ఆ ఎంవోయూలన్నీ అమలుకావు: ఇటీవల విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సు గురించి మాట్లాడుతూ ఎంవోయూ లన్నీ అమలు కావనీ, అయితే 90 శాతం అమలయ్యేలా కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు. కాగా, కొద్దిరోజులుగా అనారో గ్యంతో బాధపడుతున్న ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో పరామర్శించారు.