కోలారు, న్యూస్‌లైన్ : గ్రామ రాజకీయాల కారణంగా చిన్నారులు ఆకలితో అలమటించి పోతున్నారు. పస్తులతోనే చదువులు కొనసాగిస్తున్నారు. మధ్యాహ్న భోజనం అందక..క్షీరభాగ్య పథకానికి నోచుకోక విద్యార్థులు అల్లాడి పోతున్నారు. తాలూకాలోని నరసాపురం ఫిర్కా బెళ్లూరు గ్రామంలో ప్రముఖ యోగా సాధకుడు బీకేఎస్ అయ్యంగార్ తన భార్య పేరుపై నిర్మించిన భవనంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల నిర్వహిస్తున్నారు. 189 మంది విద్యార్థులు ఉండగా ఏడుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం మధ్యాహ్న భోజనంలో బల్లి పడి విద్యార్థులు అస్వస్థతకు గురై ఎట్టకేలకు ప్రాణగండం నుంచి బయటపడ్డారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన వంటసిబ్బంది స్థానంలో కొత్తవారిని నియమించాలని కొందరు, ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగించాలని మరికొందరు పట్టుబట్టారు. దాంతోఅధికారులు మధ్యాహ్న భోజనాన్ని ప్రైవే ట్ ఏజెన్సీకి అప్పగించి కొద్ది రోజులు పట్టణం నుంచే భోజనం సరఫరా చేశారు. తర్వాత నరసాపురం పాఠశాలలో భోజనం తయారు చేయించి బెళ్లూరుకు ఆటోల్లో తరలించే వారు. తర్వాత ఉపాధ్యాయులే వంటలు తయారు చేసి వడ్డించేవారు. అయితే స్వాతంత్ర దిన వేడుకల అనంతరం ఉన్నఫళంగా మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేశారు. దీనికితోడు క్షీరభాగ్య పథకం కూడా అమలు కావడం లేదు. పాఠశాలకు సరఫరా చేసిన పాల పొడి ప్యాకెట్లను కనీసం తెరచిన పాపాన పోలేదు. దీంతో విద్యార్థులు వారం రోజులుగా మధ్యాహ్న సమయంలో పస్తులుంటున్నారు.
మధ్యాహ్న భోజనం ఆగిన విషయాన్ని పాఠశాల అభివృద్ధి సమితి అధ్యక్షుడు, బీఈఓ, ఇతర అధికారుల దృష్టికి తెచ్చినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సువర్ణకుమారి పేర్కొంటున్నారు. ఈ విషయంపై బీఈఓ శివలింగయ్య వివరణ ఇస్తూ ఈ విషయం ఇటీవలే తన దృష్టికి వచ్చిందన్నారు. వంటవారి నియమించే అధికారం గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, ఎస్‌డీఎంసీ అధ్యక్షుడు , పీడీఓ, ప్రధానోపాధ్యాయులకు ఉందన్నారు. చిన్న చిన్న విషయాలతో వివాదాలు సృష్టించి విద్యార్థులను పస్తులుంచవద్దని పాఠశాల అభివృద్ది కమిటీకి సలహా ఇచ్చినట్లు చెప్పారు. ఎన్‌డీఎంసీ అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ త్వరలో వంటవారిని నియమించి సమస్యను పరిష్కరిస్తామనిచెప్పారు.
బెళ్లూరులో విద్యార్థుల ఆకలి కేకలు
Published Fri, Aug 23 2013 4:09 AM | Last Updated on Thu, Mar 28 2019 6:18 PM
Advertisement