సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో 50.90 శాతం మంది అర్హత సాధించినట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 16,925 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి మే 31న ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. పరీక్షలకు మొత్తం 4,79,158 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 966 కేంద్రాల్లో సెప్టెంబర్‌లో నిర్వహించిన పరీక్షకు 4,49,650 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మూల్యాంకనం అనంతరం 2,28,865 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షకు అర్హత పొందారు. అత్యధికంగా ఎస్సీ విభాగంలో 69.14 శాతం మంది అర్హత సాధించగా, ఓసీ విభాగంలో అత్యల్పంగా 29.38 శాతం మంది అర్హత సాధించారు. మొత్తం 200 మార్కులకు అత్యధికంగా 151 మార్కులు, అత్యల్పంగా 12 మార్కులు నమోదయ్యాయి.
తదుపరి పరీక్షల ప్రణాళికను త్వరలో ప్రకటిస్తామని, పార్ట్–2 దరఖాస్తు పత్రాన్ని అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని అన్నారు. ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్న ధ్రువపత్రాలన్నీ స్కాన్ చేసి దరఖాస్తుతోపాటు అప్‌లోడ్ చేయాలని తెలిపారు. ఆ తర్వాత పరీక్ష వివరాల లేఖలను కూడా వెబ్‌సైట్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు. గతం కంటే ఈసారి అర్హత పొందినవారు ఎక్కువగా ఉన్నారు. 2015 కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షకు 92.21 శాతం హాజరైతే, ఈసారి 93.46 శాతం మంది హాజరయ్యారు. అప్పుడు ప్రాథమిక పరీక్షలో 39 శాతం మంది అర్హత సాధించగా, ఈసారి 50.90 శాతం అర్హత సాధించారు. రిక్రూట్‌మెంట్ బోర్డు చేపట్టిన ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలన్నింటితో పోలిస్తే ఈసారి అర్హత శాతం పెరిగింది.
కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో 50.90 శాతం అర్హత
Published Mon, Oct 15 2018 2:24 AM | Last Updated on Mon, Oct 15 2018 2:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment