వయోవృద్ధుల్లో ‘వెన్ను’భారం!
- శాశ్వత పరిష్కారానికి సరికొత్త పరిశోధన
- ‘అడల్ట్ డీ జనరేటివ్ స్కొలియోసిస్’పై అధ్యయనం
- ఉత్తమ పరిశోధనకు తెలుగు వైద్యుడికి జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 65 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య వయస్కుల్లో 60 % మంది వెన్నుపూస ఇబ్బందులతో బాధపడుతున్నారు. దీంతోపాటు వంగిపోయి నడవ డం, దూరం నడవలేకపోవడం, కాళ్లు తిమ్మిరి వంటి సమస్యలతో కూడా సతమమవుతు న్నారు. ప్రముఖ వెన్నుపూస వైద్యులు డా.జె. నరేశ్‌బాబు బృందం ఈ సమస్య పరిష్కారానికి సరికొత్త పరిశోధన చేసింది. ఈ బృందం చేసిన పరిశోధనకు అసోసియేషన్ ఆఫ్ స్పైన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా సంస్థ జాతీయ అవార్డు ఇచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐ సీసీలో జరిగిన కార్యక్రమంలో ఏఎస్‌ఎస్‌ఐ అధ్యక్షుడు డా.రామ్‌చద్దా చేతుల మీదుగా మల్లికా స్పైనల్ సెంటర్‌కు చెందిన డా.నరేశ్ బాబు ఈ అవార్డు అందుకున్నారు. బృందం లో డా.రాజు, డా.అరుణ్‌కుమార్ ఉన్నారు.
‘స్కొలియోసిస్’ పరిశోధనకుఅవార్డు
దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి వెన్నుపూస వైద్యులు ఈ సమావేశంలో తమ పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఇందులో తెలుగు వైద్యుడైన డా.నరేశ్ సమర్పించిన ‘అడల్ట్ డీజనరేటివ్ స్కొలియోసిస్’ అనే పరిశోధనకు ఈ అవార్డు ఇచ్చారు. వయోవృద్ధుల్లో వంకర తిరిగిన వెన్నుపూసను సరిచేయడం, వంపు వల్ల నరాల మీద కలిగే ఒత్తిడిని తగ్గించేందుకు పరిశోధన చేశారు. పలువురు వృద్ధులకు శస్త్ర చికిత్సలు నిర్వహించిన అనంతరం ఈయన పరిశోధనా పత్రాలు సమర్పించారు. అత్యంత చిన్న గాటుతో జరిగే ఈ శస్త్రచికిత్స ద్వారా వెన్ను బాధల నుంచి బయటపడచ్చునని రుజువు చేశారు.