ప్రతీకాత్మక చిత్రం
దుకాణాల్లో లభించే సరుకులు, హోటళ్లలో విక్రయించే ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కల్తీ సరుకులు.. అపరిశుభ్ర వాతావరణంలో తినుబండారాల తయారీ, విక్రయం.. వెరసి రోగాలను కొనితెచ్చుకోవాల్సి వస్తోంది.
సాక్షి, భూపాలపల్లి: జిల్లాలో తినుబండారాలు తయారుచేసే షాపులు, హోటళ్లు, బిర్యానీ పాయిం ట్లు, ఆయిల్ షాపులు, మెస్‌లు వందల సంఖ్యలో ఉన్నప్పటికీ పుడ్ ఇన్‌స్పెక్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ అయిన షాపులు మాత్రం పదుల సంఖ్యలో ఉన్నా యి. దీనినిబట్టి అధికారుల పర్యవేక్షణ ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, కాటారం, ఏటూరునాగారం వంటి ప్రాంతాలతోపాటు ప్రతీ మండల కేంద్రంలో హోటళ్లు, బేకరీలు, మెస్‌లు మొదలైనవి వందల సంఖ్యలో నడుస్తున్నాయి. కొత్తగా జిల్లా ఏర్పడిన నాటి నుంచి జిల్లా కేంద్రంలో మినహా ఇతర ప్రాంతాల్లో నడిచే షాపులకు ఎటువంటి అనుమతులు లేవని తెలుస్తోంది.
ప్రజల ఆరోగ్యంతో ఆటలు
తినుబండారాల తయారీ విక్రయదారులు, హోటళ్ల యజమానులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మార్కెట్లో ప్రతీది కల్తీ అవుతోంది. లాభాపేక్షతో వ్యాపారులు తక్కువ ధరకు లభించే కల్తీ సరుకులతో తినుబండారాలను తయారు చేస్తున్నారు. చాలా వరకు అపరిశుభ్ర వాతావరణంలో తయారుచేయడం వల్ల ప్రజలు డయేరియా, కామెర్లు తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లాలో ఉపాధి కోసం చాలా మంది ఫుడ్ బిజినెస్ వైపు ఆసక్తి చూపుతున్నారు.
ఈ వ్యాపారం చేసేవారిలో లైసెన్స్‌లు పొందినవారు వెతికినా దొరకరు. కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. చాలా చోట్ల తయారీకి ఉపయోగించిన ఆయిల్‌ను మళ్లీ మళ్లీ వాడుతున్నారు. మరికొన్ని చోట్ల అపరిశుభ్ర వాతావరణంలో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను నడుపుతున్నారు. వర్షాకాలం కావడంతో ప్రతీ దుకాణం ఎదుట ఈగలు ముసురుకుంటున్నాయి. మరో వైపు రోడ్డు పక్కనే ఫాస్ట్‌ఫుడ్, అల్పాహార విక్రయశాలలను నిర్వహిస్తుండటంతో వీటిపైన దుమ్ము ధూళి పడుతోంది.
సిబ్బంది లేమితో సతమతం..
జిల్లాలో హోటళ్లు, ఇతర దుకాణాలపై పర్యవేక్షణ కరువైంది. జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అండ్ ఫుడ్‌సెఫ్టీ డిజ్గినేటెడ్ కార్యాలయం సిబ్బంది లేమి తో కొట్టుమిట్టాడుతోంది. ఈ కార్యాలయంలో గెజిటెడ్ ఆఫీసర్, ఇద్దరు ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఇద్దరు అటెండర్లు ఉండాలి. కానీ జిల్లా వ్యాప్తంగా ఒక్క జూనియర్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు.
ఈ ఒక్కరితో కార్యాలయంలో నడుస్తోంది. వరంగల్ రీజనల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తు న్న గెజిటెడ్ ఆఫీసర్, మహబూబాబాద్ ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు భూపాలపల్లికి అదనçపు బాధ్యతలు తీసుకున్నారు. సిబ్బంది లేమితో కార్యాలయం ఉండగా జిల్లాలోని హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లతో పాటు ఇతర అనుబంధ వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వారి వినియోగదారులను మోసం చేస్తున్నారు.
ఒకే ఒక్క కేసు నమోదు..
జిల్లా ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ జిల్లాలో ఇప్పటి వరకు ఒకే ఒక్క కేసు మాత్రమే నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. యథేచ్ఛగా కల్తీ చేసిన వస్తువుల విక్రయాలు చేపడుతూ, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తినుబండరాలను తయా రు చేసి అమ్ముతున్నా పట్టించుకొనే నాథుడే లేడు.
ఫుడ్ ఇన్‌ఫెక్షన్ అయింది
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు నర్రెంగుల రాజు. ములుగు మండల కేంద్రానికి చెందిన ఇతను ఇటీవల రెండు రోజుల పాటు తీవ్ర విరేచనాలు, జ్వరంతో బాధపడ్డాడు. డాక్టర్లను సంప్రదిస్తే పుడ్ ఇన్‌ఫెక్షన్ అయిందని చెప్పారు. అంతకు ముందు రాజు బయట ఆహారం తినట్లు తెలిపాడు. దాదాపుగా బయటి ఆహారాన్ని తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారని అతను పేర్కొన్నాడు.
స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం..
సిబ్బంది కొరత ఉండడం వలన షాపులపై తనిఖీలు నిర్వహించడం లేదు. సంబంధిత వ్యాపారులందరూ లైసెన్స్‌లు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. నాలుగు వారాలకు ఒకసారి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. మూడు జిల్లాలకు నేనే ఇన్‌చార్జి కావడంతో ఇబ్బందికరంగా మారింది.
– కిరణ్, జిల్లా ఇన్‌చార్జి ఫుడ్ ఇన్‌స్పెక్టర్
Comments
Please login to add a commentAdd a comment