సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. మరో నాలుగేళ్ల వరకు అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యే ఎన్నికలు లేకపోవడంతో ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం అప్పటివరకు ఉంటుందనే అంచనాతో పకడ్బందీ వ్యూహాలతో ప్రధాన రాజకీయ పక్షాలు పురపోరుకు కసరత్తు చేశాయి. నేడు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోరు ఏకపక్షమేనని, పరిషత్ ఫలితాలే మున్సిపాలిటీల్లోనూ పునరావృత మవుతాయని అధికార టీఆర్‌ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ ఎన్నికల్లోనైనా ప్రజలు తమను విశ్వసిస్తారని కాంగ్రెస్ కోటి ఆశలు పెట్టుకుంది. ఇక, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అయ్యేం దుకు ఈ ఎన్నికలు బాటలు వేస్తాయని, లోక్‌సభ ఎన్నికల ఫలితాలే మళ్లీ వస్తాయని కమలనాథులు చెబుతున్నారు. ఎంఐఎం కూడా వీలున్న చోట్ల సత్తా చాటేందుకు తన వంతు ప్రయత్నాలు చేయగా, టీజేఎస్, వామపక్షాలు ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ప్రజలు మా వైపే..
తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ హవానే కనిపిస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అధికారం చేపట్టింది. ఆ తర్వాత ఒక్క 2019 లోక్‌సభ ఎన్నికల్లో తప్ప ప్రజల తీర్పు కూడా ఏకపక్షంగానే వచ్చింది. అవి గ్రామీణ ప్రాంతాల్లోనైనా, పట్టణ ప్రాంతాల్లోనైనా, కార్పొరేషన్లయినా, జిల్లా పరిషత్‌లైనా కారు గుర్తుకే ఓట్లు పడ్డాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతమవుతాయని, 90 శాతానికి పైగా మున్సిపాలిటీలు తమ ఖాతాలోకే వస్తాయనే ధీమా గులాబీ సైన్యంలో కన్పిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఈ ఎన్నికలను పర్యవేక్షిం చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేతృత్వంలోని ఎన్నికల కమిటీ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తోంది. రెబల్స్ బెడద అధికారిక అభ్యర్థులపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. పార్టీ బలంతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కేసీఆర్ నాయకత్వ పటిమపై ఆశలు పెట్టుకుని ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సీరియస్‌గానే పనిచేసింది. ఉత్తర తెలంగాణను స్వీప్ చేస్తామని, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ నుంచి కొంత పోటీ ఎదురైనా, మెజార్టీ వార్డులతో పాటు మున్సిపాలిటీల్లోనూ తమదే విజయమనే స్థైర్యం టీఆర్‌ఎస్ నేతల్లో కనిపిస్తోంది.
కనీసం ఇప్పుడైనా..!
ఈ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడక కాదనే అంచనాతో కసరత్తు చేసిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ వైపు నిలుస్తారనే ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని పురపాలికల్లో టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కోవడమే కాకుండా గెలుస్తామనే ధీమాతో ఉంది. ముగ్గురు ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లోనే మకాం వేసి వారి పరిధిలోకి వచ్చే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జల్లెడ పట్టారు. అభ్యర్థుల ఎంపిక నుంచి పోలింగ్ వరకు ఎక్కడా ఇబ్బంది రాకుండా స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ వెళ్లారు. టీఆర్‌ఎస్‌తో పోలిస్తే కాంగ్రెస్‌కు పెద్దగా రెబల్స్ కూడా లేకపోవడంతో ఈ మూడు ఎంపీ స్థానాల పరిధిలోని మున్సిపాలిటీలపై కాంగ్రెస్ భారీ ఆశలే పెట్టుకుంది. వీటితో పాటు చేవెళ్ల, జహీరాబాద్, ఖమ్మం, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాలు, ఎమ్మెల్యేలున్న చోట్ల, గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన చోట్ల మంచి ఫలితాలు వస్తాయనే అంచనాలో కాంగ్రెస్ నేతలున్నారు. మొత్తమ్మీద 60 వరకు మున్సిపాలిటీలు, నాలుగైదు కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామనే ధీమాతో కాంగ్రెస్ రెడీ అయింది.
కమల వికాసానికి ‘దారులు’!
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అవుతామంటున్న బీజేపీ.. ఈ ఎన్నికల్లోనే అందుకు దారులు పడుతాయనే విశ్వాసంతో ఉంది. కాంగ్రెస్‌ను కాదని ప్రజలు తమ వైపే నిలుస్తారని, టీఆర్‌ఎస్ పట్ల సానుకూల అభిప్రాయం లేని ఓటర్లంతా తమ వైపే మొగ్గు చూపుతారని కమలనాథులంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తదితరులు ఈ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను తమ భుజస్కందాలపై వేసుకుని పార్టీ శ్రేణులను పరుగులు పెట్టించారు. తమను గెలిపిస్తే రాష్ట్రం ఇవ్వకపోయినా కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామనే ప్రచారంతో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ నేతలు గంపెడాశలతో పోలింగ్‌కు సిద్ధమయ్యారు. ఇక, ఎంఐఎం కూడా సత్తా చాటేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో చాలా చోట్ల తాము గెలుస్తామనే ధీమాతో ఉంది. నామమాత్రంగా బరిలో ఉన్న వామపక్షాలు, టీజేఎస్ కూడా తమ ఉనికిని చాటుకునేందుకు ఎన్నికల బరిలోకి దిగి పట్టణ ఓటరన్న తీర్పు కోసం సిద్ధమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment