విద్యాశాఖలో వసూళ్లపర్వం | Bribe in education department | Sakshi
Sakshi News home page

విద్యాశాఖలో వసూళ్లపర్వం

Published Fri, Jul 11 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM

విద్యాశాఖలో వసూళ్లపర్వం

విద్యాశాఖలో వసూళ్లపర్వం

పైసా విదిలిస్తేనే పనులు
- రికార్డు షీట్ బుక్‌కు అసలు రూ.125, కొసరు రూ.400
- టీసీ బుక్‌కు అసలు రూ.125,  కొసరు రూ.500పైనే

 కరీంనగర్ ఎడ్యుకేషన్ : పాఠశాలల్లో అందించే టీసీ.. రికార్డు షీట్స్ బుక్కుల విలువ ఎంతో తెలుసా..? అధికారికంగా రూ.200 ఉంటే.. అనధికారికంగా మరో రూ.వెయ్యి చెల్లించాల్సిందే.. ఇక్కడ కొసరే అధికం. ప్రింట్ చేసిన రికార్డ్ షీట్ బుక్స్, టీసీ బుక్స్ ద్వారా డీసీఈబీ ఖజానాకు రూ.3.50 లక్షలు వస్తుండగా.. కొసరు రూపంలో అధికారులకు ముట్టేది ఏకంగా రూ.17 లక్షలు. నమ్మశక్యంగా లేకున్నా.. నమ్మాల్సిన నిజం. పాఠశాలలకు టీసీ, రికార్డ్ షీట్స్ బుక్కులను డీఈవో కార్యాలయం నుంచి తీసుకెళ్లేందుకు ఆయా పాఠశాలలు రూ. 200 డీసీఈబీలో చెల్లించాలి. కొసరుగా అనధికారికంగా రూ.వెయ్యి చెల్లిస్తేనే వాటిని పాఠశాలలకు అప్పగిస్తున్నారు డీఈవో కార్యాలయ అధికారులు.  

విద్యార్థులను చేర్చుకోవాలంటే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ), ప్రాథమిక స్థాయి విద్యార్థులకు రికార్డుషీట్ తప్పనిసరి. వీటిని విద్యార్థులకు ఇవ్వాలంటే విద్యార్థి గతంలో చదివిన పాఠశాల ప్రభుత్వ అనుమతి పొంది ఉండడంతోపాటు ఆ పాఠశాలకు జిల్లా విద్యాశాఖ నుంచి టీసీ, రికార్డు షీట్ బుక్ తప్పనిసరి. ఈ బుక్స్‌కోసం పాఠశాలల కరస్పాడెంట్‌లు, ప్రధానోపాధ్యాయులు డీఈవో కార్యాలయానికి రావాల్సిందే. టీసీ బుక్‌కు రూ.125, రికార్డు షీట్ బుక్‌కు రూ.75 డీసీఈబీలో చెల్లిస్తే సరిపోతుంది. కానీ.. జిల్లా విద్యాధికారి కార్యాలయంలో అధికారులు మాత్రం వాటిని ఆ రేటుకు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.

తమకు ‘కొసరు’ ముట్టజెప్పితేనే షీట్లను ఇస్తామంటూ మొండికేస్తున్నారు. పాఠశాలలకు గుర్తింపు ఉన్నా.. వారు అడిగినంత ఇవ్వాల్సిందే.. లేకుంటే కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. వారు డిమాండ్ చేసే ‘కొసరు’ ఏకంగా రూ. వెయ్యి. అసలు కన్నా.. కొసరే అధికంగా ఉండడంతో పాఠశాలల యాజమాన్యాలు లబోదిబోమంటున్నాయి. వారు అడిగినంత ఇవ్వకుంటే పాఠశాలపై పగ పెంచుకుంటారని, అందుకే ఇచ్చుకోవాల్సి వస్తోందని పాఠశాలల నిర్వాహకులు వాపోతున్నారు.
 
టీసీ, రికార్డు షీట్ తీసుకోవడమిలా..

ప్రభుత్వ, ప్రభుత్వ అనుమతి పొందిన పాఠశాలలు టీసీ బుక్ తీసుకోవడానికి జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డులోని కార్యదర్శికి ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు క్వశ్చన్ పేపర్స్‌కు రుసుం చెల్లించి బకాయిలు లేవని ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలి. అనంతరం టీసీ బుక్ కోసం మళ్లీ ప్రత్యేకంగా బ్యాంక్ ద్వారా చలానా రూపంలో రూ.125తోపాటు ఉప విద్యాధికారి ధ్రువీకరించిన పత్రాన్ని డీఈవో కార్యాలయంలో అందించాలి. దానిని సంబంధిత కార్యాలయం సెక్షన్ అధికారులు పరిశీలిం చి టీసీ బుక్ అందిస్తారు. ప్రాథమిక పాఠశాలలు రూ.75 చెల్లిస్తే సరిపోతుంది.

ఈ ఏడు డీసీఈబీ మూడు వేల రికార్డు షీట్లు, వెయ్యి టీసీ బుక్‌లను ప్రింట్ చేయించింది. రికార్డు షీట్స్ బుక్స్‌కు అధికారికంగా డీసీఈబీకి వచ్చేది రూ.2.25 లక్షలు. టీసీ బుక్‌లకు రూ.1.25 లక్షలు. అధికారులకు ముట్టేది మాత్రం అక్షరాల రూ.17 లక్షలు. కొసరు మొత్తాన్ని కిందిస్థాయి ఉద్యోగులు వాటాలుగా పంచుకుంటున్నారని సమాచారం. టీసీలు అందించే విభాగాన్ని కార్యాలయంలోని ఓ ఉద్యోగికే ఏళ్ల తరబడిగా కేటాయించడంతో ఈ తంతుకు అంతులేకుండా పోతోందని గుసగుసలాడుకుంటున్నారు.
 
వంద పేపర్లకు వేల రూపాయలా?

 ఒక బుక్‌లో వంద పేజీలుంటే.. దానికి జిల్లా విద్యాశాఖ అధికారులు వేలాది రూపాయలు వసూలు చేయడంపై హెచ్‌ఎంలు పెదవి విరుస్తున్నారు. ఇన్‌వార్డు, అవుట్‌వార్డు, స్టాంపింగ్ చేసే అటెండర్‌నుంచి విద్యాధికారి కార్యాలయంలోని అధికారి వరకు పైసలు ఇస్తేనే చేతికి బుక్స్ అనే తీరు సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని అడిగితే బుక్ ఇవ్వకపోగా మీ పాఠశాలలో అన్నీ సరిగా ఉన్నాయా? అంటూ దబాయించే స్థాయిలో ఉన్న వీరిని  పై అధికారులే సరిచేయాలని కోరుతున్నారు.
 సూచనలిస్తాం
 - ప్రసాద్‌రావు, ఏడీ, డీఈవో కార్యాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement