మాఫియా రాజ్యమేలడమేనా.. బంగారు తెలంగాణ
♦ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి
హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనలో ఇసుక, కల్తీ, డ్రగ్స్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. డ్రగ్స్ మాఫియాతో హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా ఉందని విమర్శించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం మార్కెట్ యార్డ్ తరలింపుపై ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో మాఫియా రాజ్యమేలడమేనా బంగారు తెలంగాణ అంటే అని ప్రశ్నించారు.
సర్కారు పెద్దలు ఏం చేస్తున్నారు, సీఎం కేసీఆర్ ఇప్పటికైనా మేలుకోవాలని అన్నారు. ఉక్కుపాదంతో ఈ మాఫియాను అణచివేయాలని, లేకుంటే హైద్రాబాద్ బ్రాండ్ విలువ పడిపోతుందని హెచ్చరించారు. డ్రగ్స దందా చివరకు స్కూల్ స్థాయికి పాకిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు ప్రబలుతున్నాయని, ఆరోగ్యశాఖ తక్షణం అప్రమత్తం కావాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఉస్మానియా హాస్పిటల్‌కు ప్రభుత్వం రూ.2వందల కోట్లు కేటాయిస్తే, ఇప్పటివరకు కేవలం రూ.6 కోట్లే విడుదల కావడం మరీ దయనీయమై చర్యగా వ్యాఖ్యానించారు.