అక్రమాల పుట్ట.. | Corruption in TSSR Contract | Sakshi
Sakshi News home page

అక్రమాల పుట్ట..

Published Fri, Jun 21 2019 9:21 AM | Last Updated on Fri, Jun 21 2019 9:21 AM

Corruption in TSSR Contract - Sakshi

సాక్షి, సిటీబ్యూరో:  ప్రభుత్వ నిర్మాణ పనుల కాంట్రాక్టుల రూపకల్పనలో కీలకమైన తెలంగాణ స్టేట్‌ స్టాండర్డ్స్‌ రేట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌)జాబితా అక్రమాల పుట్టగా మారింది. నిపుణుల కమిటీ సిఫార్సు చేయకుండా, ఆయా కంపెనీల ఉత్పత్తుల నాణ్యతను ల్యాబ్‌లో పరీక్షించకుండా వాటికి ధరలు, కేటగిరీలు నిర్ణయించడంలో భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు తెలంగాణ విద్యుత్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీఈసీఏ)ఆరోపించింది. ఇటు గుర్తింపు పొందిన విద్యుత్‌ కాంట్రాక్టర్లకే కాకుండా ప్రభుత్వానికి నష్టా లు తెచ్చిపెడుతున్న ఈ ఎస్‌ఎస్‌ఆర్‌ రూపకల్పనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. నిజానికి  ప్రభుత్వ నిర్మాణాల్లో ఉపయోగించే ఏదైనా వస్తువు నాణ్యతను, ధరలను నిర్ణయించాలంటే నిపుణుల కమిటీ ముందుగా ఆయా వస్తువులను పరీక్షించాలి. అయితే విద్యుత్‌ వైర్లు, స్విచ్‌లు, ప్యానల్‌ బోర్డులు, కాపర్‌వైర్లు, ఫ్యూజ్‌లు, ఫ్యాన్లు, ఇంట్లో, వీధుల్లో వెలుగులు విరజిమ్మే ఎల్‌ఈడీ లైట్లు, స్విచ్‌గేర్లు, జనరేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఏసీ, తదితర విద్యుత్‌ మెటీరియల్‌ ఎంపిక, వాటి ధర, నాణ్యతకు సంబంధించిన ఎస్‌ఎస్‌ఆర్‌ జాబితాను చీఫ్‌ విద్యుత్‌ తనిఖీ అధికారి(సీఈఐజీ) కాకుండా రహదారులు, భవనాలశాఖ చీఫ్‌ ఇంజినీర్‌ రూపొందిస్తుండటం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కనీసం నిపుణుల కమిటీని సంప్రదించకుండా, మెటీరియల్‌ను ల్యాబ్‌లో పరీ క్షించకుండా ఏకపక్షంగా ఎస్‌ఎస్‌ఆర్‌ జాబితాను ఎంపిక చేస్తుండటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబందించి ఆర్‌అండ్‌బీ విభాగంలో కనీసం టెస్టింగ్‌ ల్యాబ్‌ లేకపోయినా విద్యుత్‌ మెటీరియల్‌ నాణ్యతతో పాటు ధరలను ఎలా నిర్ణయిస్తున్నారనే ప్రశ్నకు సంబంధిత అధికారుల వద్ద సమాధానం లేదు. ఒకే కేటగిరిలో అనేక కంపెనీల ఉత్పత్తులు ఉండటం, వాటిని కాంట్రాక్టర్లు వాడటం వల్ల ప్రభుత్వం నష్టపోవాల్సి వస్తుంది.నాసిరకం ఉత్పత్తుల కారణంగా ఆయా భవనాల్లో తరచూ విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌లు జరిగి కంప్యూటర్లు, ఏసీలతో పాటు విలువైన ఫైళ్లు దగ్ధం అవుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

 సమగ్ర విచారణ జరిపించాలి
ప్రభుత్వం చేపట్టే ఏ నిర్మాణ పనుల్లోనైనా ఆర్‌అండ్‌బీ రూపొందించిన స్టేట్‌ స్టాండర్డ్స్‌ రేట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) ప్రకారం ఆయా కంపెనీల విద్యుత్‌ మెటీరియల్‌ను వాడాల్సి ఉంది. ఎస్‌ఎస్‌ఆర్‌ జాబితా రూపొందించిన ధరల ప్రకారమే ప్రభుత్వ శాఖలు ఎస్టిమేషన్‌ వేసి టెండర్లు పిలుస్తాయి. ఎస్‌ఎస్‌ఆర్‌ జాబితాలో 1518 విద్యుత్‌ వస్తువులు ఉండగా, వీటిని మూడు కేటగిరిలుగా విభజించారు. ఒక్కో కేటగిరిలో 10 నుంచి 15 కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులను చేర్చారు. ఐటమ్‌ స్పెసిఫికేషన్‌ పరిశీలించకుండా వీటిని జాబితాలో చేర్చి, కేటగిరీల వారీగా ధరలు నిర్ణయించడం వల్ల ఏదీ నాణ్యమైనదో? ఏదీ నాసిరకమైనదో తెలియక విద్యుత్‌ కాంట్రాక్టర్లే కాదు..ఆయా విభాగాల ఇంజినీర్లు సైతం తలపట్టుకుంటున్నారు. వాస్తవానికి ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ స్టాండర్డ్స్‌ ప్రకారం నాణ్యమైన వస్తువులను వాడాల్సి ఉంది. అయితే ఎస్‌ఎస్‌ఆర్‌ జాబితాలో మూడు కేటగిరీలు ఉండటం, ఒక్కో కేటగిరిలో లెక్కకు మించి కంపెనీలు ఉండటం ఇబ్బందిగా మారుతోంది. అంతేకాదు సివిల్‌ కాంట్రాక్టర్లకు 13.61 శాతం ఓవర్‌హెడ్‌  కలుపుతూ, రిజిస్టర్డ్‌ విద్యుత్‌ కాంట్రాక్టర్లపై వివక్ష చూపుతున్నారు. ఇప్పటికైనా ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలి.–కందుకూరి శ్రీనివాస్, తెలంగాణ ఎలక్ట్రికల్‌ లైసెన్సింగ్‌ బోర్డు మెంబర్‌  

ఏడాది తిరిగేలోపే కేటగిరి మార్పు
గతంలో ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలోనే ఎస్‌ఎస్‌ఆర్‌ రూపొందించేవారు. నిర్మాణ పనులతో పాటు ఎలక్ట్రికల్‌ పరికరాలకు సంబంధించిన పనులు నిర్వహించేవారు. జాబితాలో రూపొందించిన ధరల ప్రకారమే టెండర్‌ పిలిచేవారు. మారిన పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం ఏ విభాగానికి ఆ విభాగం ఇంజినీరింగ్‌ సెక్షన్‌ను ప్రత్యే కంగా ఏర్పాటు చేసుకుని, ప్రత్యేకంగా ఇంజినీర్లను నియమించుకుంది. నిజానికి ఏదైనా కంపెనీ మెటీరియల్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ జాబితాలో చేర్చాలన్నా..ధరలను పెంచాలన్నా..తగ్గించాలన్నా..ఆయా విభాగాల్లో పని చేస్తున్న ఇంజినీరింగ్‌ నిపుణులతో చర్చించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గత ఐదేళ్లుగా ఎలాంటి చర్చలు, నాణ్యత పరీక్షలు జరుపకుండానే విద్యుత్‌ వస్తువులను జాబితాలో చేర్చుతుండమే కాదు ఏకంగా వాటిని తొలి కేటగిరిలో చేర్చుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వాటి ధరలను మార్చాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. అడిగినంత అప్పగిస్తే చాలూ.. మూడో కేటగిరిలో ఉన్న కంపెనీ ఉత్పత్తులను మొదటి కేటగిరిలోకి మార్చడం, మొదటి కేటగిరిలో ఉన్న కంపెనీ ఉత్పత్తులను మూడో కేటగిరిలోకి మార్చడం పరిపాటిగా మారింది. ఒకసారి కేటగిరి నిర్ధారించిన తర్వాత అదే కంపెనీకి చెందిన అదే వస్తువుకు ఆ తర్వాతి ఏడాది కేటగిరీల్లో మార్పు ఎందుకు చోటు చేసుకుంటుందో అర్థం కావడం లేదు.   –మాజీద్, కార్యదర్శి, టీఈసీఏ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement