మాట్లాడుతున్న లక్ష్మి,ఉదయ్ దంపతులు
నేరేడ్‌మెట్: అనుమానాలు..అపార్థాలు..మనస్పర్థలతో పోలీసు కేసులతో వీడిపోవాలనుకునే దంపతుల మధ్య రాజీ కుదిర్చి వైవాహిక బంధం పటిష్టానికి కుటుంబ సహాయ కేంద్రాలు (ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు) దోహదపడుతున్నాయని రాచకొండ సీపీ మహేష్‌భగవత్ అన్నారు. 2016 గాంధీజయంతి రోజున రాచకొండ పోలీసుల సహకారంతో ఎన్‌జీవో సంస్థ ‘అంకురం’కుషాయిగూడ ఠాణాలో కుటుంబ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. బుధవారానికి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో తృతీయ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో సఖితోపాటు అంకురం, భూమిక సంస్థల ఆధ్వర్యంలో భువనగిరి, సరూర్‌నగర్, ఉప్పల్, నేరేడ్‌మెట్ పాకరంతాల్లో ఐదు కుటుంబ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత మూడేళ్లలో వివిధ కారణాల నేపథ్యంలో 1273 జంటలు కుషాయిగూడ ఫ్యామిలీ సహాయ కేంద్రాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు.
కౌన్సెలింగ్ అనంతరం కేసులను ఉపసంహరించుకొని 468 జంటలు రాజీ పడి, సంతోషంగా జీవిస్తున్నట్లు సీపీ వివరించారు. 491 దంపతుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాజీ పడిన జంటలు తిరిగి గొడవ పడి ఠాణాలకు వెళ్లకపోవడం వివాహ వ్యవస్థ బలోపేతానికి ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు చేస్తున్న కృషికి నిదర్శమన్నారు. ఈ సెంటర్ల నిర్వాహకులు ,కౌన్సెలర్లు దంపతులను వేర్వేరుగా కౌన్సెలింగ్ చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి సూచనలు అందిస్తున్నందున కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. గృహహింస కేసులకు వరకట్నం ఒక్కటే కారణం కాదని, భర్తలకు మద్యం అలవాటుతోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్లు సీపీ వివరించారు. 2016–19 వరకు వరకట్న సమస్యపై 223 కేసులు నమోదు కాగా, మద్యం కారణంగా 335 కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు.
సినిమాలు, సీరియళ్ల ప్రభావం
సినిమాలు, టీవీ సీరియల్స్, సోషల్‌మీడియా ప్రభావం భార్యాభర్తల మధ్య విభేదాలకు దారితీస్తోందని సీపీ అభిప్రాయపడ్డారు. అపార్ట్‌మెంట్ సంస్కృతి పెరగటం, ఉమ్మడి కుటుంబాలు తగ్గటం కూడా ఇందుకు కారణమన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. షీ టీంలు, ఫ్యామిలీ, సఖి కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటుతోపాటు ఐటీ కంపెనీల ప్రతినిధులతో మార్గదర్శక్‌లను నియమించడం జరిగిందని ఆయన వివరించారు. మై ఆటో, క్యాబ్ సేఫ్ తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. చిన్నచిన్న కారణాలతో కేసులుపెట్టుకొని భార్యభర్తలు వీడిపోరాదని సీపీ సూచించారు. దంపతులు దూరమైతే వారి పిల్లలు, కుటుంబం రోడ్డు పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చార్జిషీట్ దాఖలైన తర్వాత కూడా కలిసి ఉండటానికి అవకాశం ఉంటుందన్నారు. ‘అర్థరాత్రి మహిళలు స్వేచ్ఛగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని’ మహాత్మగాంధీ కలను సాకారం చేసేందుకు పోలీసు శాఖ కృషి చేస్తుందన్నారు. కౌన్సెలింగ్ అనంతరం రాజీపడిన డీఆర్‌డీఏ శాస్త్రవేత్త సురేష్‌తోపాటు లక్ష్మి, ఉదయ్, ఉష, ఓంప్రకాష్, స్వాతి, శివశంకర్ దంపతులు తమ అనుభవాలను వివరించారు. సమావేశంలో మల్కాజిగిరి ఇన్‌ఛార్జి డీసీపీ నారాయణరెడ్డి, షీటీం డీసీపీ సలీమా, అంకురం సంస్థ డైరెక్టర్ సుమిత్ర, ఎస్సీఎస్టీ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు మమత, పలువురు కౌన్సిలర్లు, మార్గదర్శక్‌లు పాల్గొన్నారు. సెంటర్ ప్రతినిధులు,పోలీసులకు సీపీ అవార్డులు అందజేశారు.
కౌన్సెలింగ్‌తో మార్పు వచ్చింది..
నా పేరు లక్ష్మి, కూలి పనులు చేస్తాను. భర్త పేరు ఉదయ్ డ్రైవర్. ఆరు నెలల క్రితం మా మధ్య చిన్న గొడవ జరిగింది. వీడిపోవాలనుకున్నాం. పోలీసులు కౌన్సెలింగ్ సెంటర్‌కు పంపించారు. అక్కడ కౌన్సిలర్ శ్యామల కౌన్సెలింగ్ చేయడం వల్ల మాలో మార్పు వచ్చింది. ఇద్దరం రాజీ పడ్డాం. ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment