సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) తొలి మహాసభలు నేడు(ఆదివారం) హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణమండపంలో ప్రారంభంకానున్నాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ తదితర కూడళ్లు ఎర్రజెండాలు, తోరణాలతో ఎరుపుమయంగా మారాయి. సుమారుగా 650 మంది ప్రతినిధులు హాజరుకానున్న ఈ మహాసభలు నాలుగురోజులపాటు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం సీపీఎం పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
10.30 గంటలకు ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రకాష్‌కారత్ ప్రారంభోపన్యాసం చేస్తారు. పార్టీ నేతల ప్రసంగాల అనంతరం తొమ్మిది వామపక్షపార్టీల నాయకుల సందేశాలు ఉంటాయి. మహాసభల సందర్భంగా నిజాం కాలేజీ మైదానంలో 1-4 తేదీల మధ్య జనజాతర పేరిట సాంస్కృతిక, కళా ప్రదర్శనలు. లఘుచిత్రాలు, తెలంగాణ వంటకాలు, వివిధ తెలంగాణ కళారూపాల ప్రదర్శనలు ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటలకు నిజాంకాలేజీ ఆవరణలోని ‘బండెనుక బండి’ గేయ రచయిత యాదగిరి కళా ప్రాంగణంలో జనజాతర ప్రదర్శనలను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభిస్తారు.
మహాసభల ముగింపు సందర్భంగా 4వ తేదీన నిజాం కాలేజీలో బహిరంగసభ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ముద్రను తొలగించుకుని ప్రజామద్దతును సాధించే దిశలో కార్యక్రమాలను రూపొందించుకోవాలని యోచిస్తోంది. పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా నిర్మాణపరమైన మార్పులకు రంగం సిద్ధం చేయనుంది. ప్రజల ఆకాంక్షలు, సమస్యల సాధనకు కృషిచేయడం ద్వారా వారి ఆదరణను పొందాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.