కరెంట్ కట కట
డిమాండ్‌కు సరఫరాకు భారీ వ్యత్యాసం
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో కరెంట్ సరఫరా పరిస్థితి దయనీయంగా మారింది. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో అన్నివర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. జిల్లాకు ప్రతిరోజూ 15మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉండగా 11 నుంచి 13 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో వ్యవసాయరంగం, పరిశ్రమలు, గృహాలు అన్న తేడా లేకుండా ఎడాపెడా కోతలు విధిస్తున్నారు.
ముఖ్యంగా వ్యవసాయ రంగానికి రెండు మూడు గంటలకు మించి కరెంట్ సరఫరా కావడం లేదు. మరోవైపు ఓవర్‌లోడ్‌తో పదేపదే కరెంట్ ట్రిప్ అవుతోంది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. చేతికొచ్చిన పంట కళ్ల ముందే ఎండిపోతోంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక కొన్నిచోట్ల రైతన్నలు రోడ్డెక్కుతుంటే, మరికొన్ని చోట్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
కోలుకోలేకపోతున్న రైతన్న
జిల్లాలో విద్యుత్ అధికారుల లెక్కల ప్రకారం 2,19,000 వ్యవసాయ కనెక్షన్లున్నాయి. అనధికారికం గా మరో 40వేల కనెక్షన్లు ఉంటాయని అంచనా. వీ టికి విద్యుత్ సరఫరా నిమిత్తం త్రీపేజ్ ట్రాన్స్‌ఫార్మ ర్లు 36,176 ఉన్నాయి. వ్యవసాయరంగానికి రెండు విడతల్లో కచ్చితంగా ఆరు గంటల పాటు కరెంటు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అందుకు అ నుగుణంగా జిల్లా మొత్తాన్ని ఎ, బి గ్రూపులుగా విభజించారు. ఎ గ్రూపు ప్రాంతాలకు ఉదయం 9 నుంచి 12గంటల వరకు, తిరిగి రాత్రి 9 నుంచి 12 వరకు ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా బి గ్రూపుగా ఉన్న ప్రాంతాలకు సాయంత్రం 3నుంచి 6గంటల వరకు, తిరిగి అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల వరకు సరఫరా చేయాలని నిర్ణయించారు.
ఈ రెండు గ్రూపులకు కేటాయించిన సమయాల్లో జిల్లాకు కరెంట్ సరఫరా లేకపోతే అంతే సంగతులు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయరంగానికి రోజూ మూడు గంటలకు మించి కరెంట్ సరఫరా కావడం లేదు. అలాగే ఓవర్‌లోడ్ పుణ్యమా అని పదే పదే కరెంట్ ట్రిప్ అవుతోంది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి, ఫీజులు ఎగిరిపోతున్నాయి.
ఫీజులు సరిచేసేటప్పుడు షాక్ గురై పదుల సంఖ్యలో రైతులు మరణించారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయంటే అవి బాగు చేయడం కోసం రెండుమూడు రోజులు పడుతోంది. ఈ నేపథ్యంలో చేతికొచ్చిన పంట కళ్ల ముందే ఎండిపోతోంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక కొన్ని చోట్ల రైతన్నలు రోడ్డెక్కుతుంటే, మరికొన్ని చోట్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
పరిశ్రమల పరిస్థితి అంతే..!
రాజధాని నగరానికి, అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో ఉండడం వల్ల జిల్లాలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. జిల్లాలో చిన్న పరిశ్రమలు 7,664, కాటేజీ పరిశ్రమలు 614, పెద్ద పరిశ్రమలు 593 ఉన్నాయి. అన్ని పరిశ్రమల్లో కలిపి దాదాపు 40వేల మందికి ఉపాధి లభిస్తోంది. కరెంట్ కొరత నేపథ్యంలో వీటన్నింటికీ కూడా వారంలో రెండు రోజుల పాటు మంగళ, బుధవారాలు కోత విధిస్తున్నారు. జనరేటర్ల ఉపయోగించాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో చిన్న పరిశ్రమలు ఆ సాహసం చేయడంలేదు.
అయితే పెద్ద పరిశ్రమలది మరో వింత పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. పెద్ద పరిశ్రమలు కొనసాగాలంటే హైటె న్షన్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన జనరేటర్లు లభించకపోవడంతో వారు మూతవేస్తున్నారు. దీంతో పరిశ్రమలు వచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయలేక యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. అలాగే పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు కూడా బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తున్నారు. చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విద్యుత్ వినియోగం ఇలా..
వ్యవసాయ కనెక్షన్లు 2,19,000
(అధికారికంగా)
చిన్న పరిశ్రమలు 7,664
కాటేజీ పరిశ్రమలు 614
పెద్ద పరిశ్రమలు 593
అవసరమైన విద్యుత్ (మి.యూ) 15
సరఫరా అవుతున్నది (మి.యూ) 11
సాగుకు సరఫరా చేయాల్సింది ఇలా..
ఎ గ్రూపు కింద
ఉదయం: 9 నుంచి 12గంటల వరకు
రాత్రి: 9 నుంచి 12గంటల వరకు
బి గ్రూపునకు...
సాయంత్రం: 3 నుంచి 6గంటల వరకు
అర్ధరాత్రి: 12నుంచి 3గంటల వరకు