ధూంధాం కళాకారుడి ఆత్మహత్య
ఉద్యోగం, ఉపాధి లేక మనస్తాపం
గీసుకొండ: తెలంగాణ ఉద్యమ సమయంలో ధూంధాం కార్యక్రమాల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచిన ఆ గొంతు మూగబోయింది. ఉద్యోగం, ఉపాధిలేకపోవడంతో వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తిహవేలి గ్రామానికి చెందిన బొల్లం మధు(26) ఆత్మహత్య చేసుకున్నాడు. బొల్లం మధు హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదివాడు. విద్యార్థి దశ నుంచే ఉద్యమ పాటలు రాయడం, పాడడం ప్రారంభించాడు. కళాశాలలో చదువుతున్న క్రమంలో విద్యార్థి జేఏసీలో క్రియాశీలకంగా పనిచేస్తూనే «తెలంగాణ ధూంధాం కళాకారుల బృందంలో ముఖ్యసభ్యుడిగా ఉండేవాడు.
పలు ప్రాంతాల్లో ధూంధాం కార్యక్రమాల ద్వారా పాటలు పాడి ప్రజలను ఉత్తేజపరిచాడు. మధు తండ్రి కొన్నేళ్ల క్రితం మృతి చెందగా.. తల్లి బొల్లం కనకలక్ష్మి, ఇద్దరు అన్నదమ్ములు, చెల్లెళ్లు ఉన్నారు. గతంలో వీరి వివాహాలు కాగా తల్లితో పాటు అన్నదమ్ములు ఇద్దరూ కూలిపని చేస్తున్నారు. 2011లో డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో పాటు ఎలాంటి ఉపాధి మార్గం లేకపోవడంతో మధు కొంత కాలంగా మనోవేదనలో ఉన్నాడు. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెంది ఈ నెల 23న ఇంటి వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.