మా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోలేదు | Did Not take into consideration of Dalits interest | Sakshi
Sakshi News home page

మా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోలేదు

Published Tue, Mar 11 2014 6:30 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

మా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోలేదు - Sakshi

మా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోలేదు

సాక్షి, హైదరాబాద్: చుండూరు దళితుల ఊచకోత వ్యవహారంలో విచారణ జరుపుతున్న ధర్మాసనం బాధితుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని, పెపైచ్చు నిందితుల ప్రయోజనాలను మాత్రమే చూస్తోందంటూ చుండూరు దళిత బాధితుల పోరాట కమిటీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. చుండూరు బాధితులందరి తరఫున పోరాట కమిటీ అధ్యక్షుడి హోదాలో తాను ఈ అఫిడవిట్‌ను దాఖలు చేస్తున్నట్లు జె.మోజెస్ పేర్కొన్నారు. చుండూరు దళితుల ఊచకోతపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి అనీస్ 2007, ఆగస్టు 1న తీర్పునిస్తూ 179 మంది నిందితుల్లో 123 మందిని నిర్దోషులుగా ప్రకటించారు.
 
 మిగిలిన వారిలో 21 మందికి యావజ్జీవం, మరో 35 మందికి ఏడాది జైలు శిక్ష, జరిమానా విధించారు. 123 మందిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ బాధిత కుటుంబాలు అప్పీళ్లు దాఖలు చేయగా, శిక్ష పడిన వారు తమ శిక్షను రద్దు చేయాలంటూ, నిర్దోషులుగా విడుదలైన వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తూ వస్తోంది. గతవారం ఈ వ్యాజ్యాల విచారణకు వచ్చిన సమయంలో, ధర్మాసనం పట్ల బాధితులు అవిశ్వాసం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో బాధితుల్లో ఎవరిపట్ల తమకు అవిశ్వాసం ఉందో వారి పేర్లు చెప్పాలని ధర్మాసనం స్పెషల్ పీపీ బొజ్జా తారకాన్ని ఆదేశించింది. అంతేకాక స్పెషల్ పీపీ బాధితుల తరఫున పనిచేయాలా..? లేక ప్రభుత్వ సలహా ఆధారంగా పనిచేయాలా..? అన్న న్యాయపరమైన సందేహం వ్యక్తం చేస్తూ, దీనిపై స్పష్టతనిచ్చేందుకు అటార్నీ జనరల్ లేదా ఆయన సూచించిన వ్యక్తి తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఇందులో భాగంగా సోమవారం ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది.
 
 
 ఈ సందర్భంగా ధర్మాసనం ఆదేశించిన విధంగా బాధితులందరి తరఫున మోజెస్ ఓ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ధర్మాసనం ముందు అప్పీళ్లన్నీ కూడా ఒకే అంశానికి సంబంధించినవని, అయితే వాటిలో నిందితులు దాఖలు చేసిన అప్పీళ్లను మాత్రమే విచారించేందుకు ధర్మాసనం అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. ఇది ఎంత మాత్రం సరికాదని, దీనివల్ల తాము న్యాయం కోసం ఏళ్ల తరబడి చేస్తున్న పోరాటానికి అర్థం లేకుండా పోతుందని తెలిపారు.
 
 ఈ నేపథ్యంలో తమకు ధర్మాసనం తమ (బాధితుల) ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవడంలేదనే ఆందోళన కలిగిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి ఈ కేసులో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్‌రెడ్డి సీల్డ్ కవర్‌లో ధర్మాసనం ముందుంచారు. ధర్మాసనం పట్ల అవిశ్వాసం ఉన్నట్లు చెప్పాలని ప్రభుత్వం ఎన్నడూ కూడా స్పెషల్ పీపీలకు చెప్పలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందులో పేర్కొన్నట్లు తెలిసింది. అటు తరువాత ధర్మాసనం అటార్నీ జనరల్ గురించి వాకబు చేసింది. ఈ నెల 18న అదనపు సొలిసిటర్ జనరల్ విల్సన్ ఈ కేసులో కోర్టు ముందు హాజరై సహకరిస్తారని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ పొన్నం అశోక్‌గౌడ్ ధర్మాసనానికి నివేదించారు. దీంతో ధర్మాసనం ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం 18కి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement