కేసీఆర్ అబద్ధాలకోరు.. : ఇంద్రసేనారెడ్డి
బీజేపీ జాతీయ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి
వరంగల్ చౌరస్తా, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అబద్దాలకోరు అని, పూటకోమాట మాట్లాడే ఆయన బీజేపీని విలన్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. వరంగల్ నగరంలోని పిన్నవారి వీధిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయడం సాధ్యం కాదని గమనించి.. ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నాడని అన్నారు.
ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న కేసీఆర్.. బీజేపీ నేతల దిష్టిబొమ్మలను దహనం చేయించడం సరికాదన్నారు. 1956నాటి తెలంగాణ కావాలని బహిరంగ సభల్లో ప్రకటనలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా, పార్లమెం టులో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ నోరెం దుకు మెదపలేదని ప్రశ్నించారు. పోలవరం విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని నాడు అన్ని పార్టీలు సమర్థించాయని అన్నారు. ఇంకా హైదరాబాద్‌ను యూటీ చేయాలనే ప్రతిపాదనకు అడ్డుపడింది బీజేపీయేనని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలను కేసీఆర్ మానుకుంటే మంచిదన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌రావుకు తమ పార్టీని విమర్శించే హక్కులేదని నల్లు అన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ భాగస్వామ్య ప్రభుత్వ హయాంలోనే పోలవరంపై 111 జీవో విడుదలైన విషయాన్ని హరీశ్ మరిచిపోతే గుర్తు చేసుకోవాలని సూచించా రు.
కేంద్ర మంత్రివర్గ విస్తరణ మరో దఫా ఉంటుందని, అప్పుడు పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయక అవకాశం రావచ్చని తెలిపారు. బంగారు తెలంగాణ కోసం అందరూ శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి తమ పార్టీ అన్నివిధాలా సహకరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 1, 2 తేదీల్లో పార్టీ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అర్బన్ అధ్యక్షుడు చింతాకుల సునిల్ తెలిపారు. సమావేశంలో నాయకులు చాడ శ్రీనివాస్‌రెడ్డి, గందె నవీన్, మల్లారెడ్డి, లక్ష్మన్‌నాయక్, పుప్పాల రాజేందర్, బాకం హరిశంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.