విద్యుదాఘాతంతో ఒకరి మృతి
* బోరుకు కనెక్షన్ ఇస్తుండగా ఘటన
* పరిహారం కోసం ఆందోళనకు దిగిన బాధిత కుటుంబ సభ్యులు
* సర్పంచ్ జోక్యంతో సద్దుమణిగిన వివాదం
పుల్‌కల్ : విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని చక్రియాల్‌లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కాశపాగ సత్తయ్య (45) అదే గ్రామానికి చెందిన ముర ళీ వెంకట్‌రెడ్డి వద్ద రెండేళ్లుగా పాలేరుగా పనిచేస్తున్నాడు. కాగా గ్రామానికి చెంది న తలారి పద్మారావు తన వ్యవసాయ పొలంలో ఇటీవల కొత్తగా బోరు వేసి మోటార్‌ను దింపాడు. అయితే విద్యుత్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉండడంతో ఆ పనులు తెలిసిన సత్తయ్యను ఆదివారం పది గంటల ప్రాంతంలో పద్మారావు తన పొ లం వద్దకు తీసుకెళ్లాడు.
ఇదిలా ఉండ గా.. చక్రియాల్ వ్యవసాయ బోర్లకు ఉద యం 6 గంటల నుంచి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండానే సత్తయ్య మధ్యాహ్నం 11.30 గంటల ప్రాంతంలో విద్యుత్ స్తంభం ఎక్కి సర్వీస్ వైరు వేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై వైర్ల పైనే పడి మృతి చెందాడు. దీనిని గమనించిన పద్మారావు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయాన్ని గమనించిన మేకల కాపరు లు విషయాన్ని గ్రామస్తులకు సమాచా రం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడి చేరుకుని విలపించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు.
పరిహారం ఇచ్చే వరకు మృతదేహాన్ని దింపం
పరిహారం ఇచ్చే వరకు స్తంభం నుంచి మృతదేహాన్ని దించే ప్రసక్తే లేదని మృతుడి కుమారుడు శ్రీకాంత్, కుటుంబ సభ్యులు భీష్మించారు. దీంతో పోలీసులు సైతం ఏమీ చేయలేక సర్పంచ్ కృష్ణతో పాటు గ్రామ పెద్దలు చర్చలు జరిపారు. కనెక్షన్ ఇచ్చేందుకు తీసుకెళ్లిన పద్మారావును బాధ్యుడిని చే స్తూ ఎకరం భూమి ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే పద్మారావు తాను రూ. 50 వేలు మించి ఇవ్వలేని చెప్పడంతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సత్తయ్య మృతదేహాన్ని కిందకు దించలేదు. అయితే సర్పంచ్ కృష్ణ జోక్యం చేసుకుని కుమారుడు పేర అర ఎకరం భూమిని పట్టా చేయిస్తానని హామీ ఇవ్వడంతో సమస్య సద్దు మణిగింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లైన్‌మన్ లేకనే..
తమ గ్రామానికి విద్యుత్ లైన్‌మన్ లేకపోవడంతోనే అమాయకుల ప్రాణాలు పోతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది సైతం ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎర్త్ ఫీజ్ వేస్తూ గ్రామానికి చెందిన చిన్నా పాండు విద్యుదాఘాతంతో మృతి చెందారని గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారుల స్పందించి గ్రామానికి విద్యుత్ లైన్‌మన్‌ను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.