పెనుగాలి బీభత్సం | Women in fury | Sakshi
Sakshi News home page

పెనుగాలి బీభత్సం

Published Fri, May 23 2014 2:58 AM | Last Updated on Wed, Sep 5 2018 1:46 PM

పెనుగాలి బీభత్సం - Sakshi

పెనుగాలి బీభత్సం

  •     కలికిరిలో పిడుగుపాటుకు ఒకరి మృతి
  •      పుత్తూరు మండలంలో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
  •      విద్యుత్ సరఫరా లేక 14 పంచాయతీల్లో అంధకారం
  •  జిల్లాలోని పుత్తూరు, కలికిరి, నగరి, విజయపురం, వడమాలపేట మండలాల్లో గురువారం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. అరగంట ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కలికిరి శివారు ప్రాంతంలో పిడుగుపడి ఒకరు మృతి చెందాడు. పుత్తూరు మండలంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మామిడికాయలు నేలరాలాయి.
     
    పుత్తూరురూరల్, న్యూస్‌లైన్:  పుత్తూరు మండలంలో గురువారం గాలీవాన బీభత్సం సృష్టించింది. గాలి తీవ్రతకు మండల పరిధిలోని దాదాపు 50 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మామిడికాయలు పెద్ద మొత్తంలో నేలరాలాయి. మండలంలో సాయంత్రం 5 నుంచి 6.30గంటల వరకు గాలితో కూడిన వర్షం కురిసింది. గాలి ఎక్కువగా ఉండడంతో పున్నమి హోటల్ వద్దనున్న రాచపాళెం దళితవాడలో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.

    ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. పట్టణ సమీపంలోని శిరుగురాచపాళెం వద్దనున్న పెట్రోల్ బంకుపై రేకులు గాలికి ఎగిరిపోయాయి. అదే సమయంలో అక్కడ పెట్రోల్ కోసం వేచి ఉన్న పుత్తూరు సమీపంలోని నెత్తం గ్రామానికి చెందిన సురేష్, పూజితపై రేకులు పడడంతో గాయాలయ్యాయి. వారిని స్థానికులు పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మండల పరిధిలోని 14 పంచాయతీల్లో మామిడి చెట్లు నేలకొరిగాయి.

    మామిడికాయలు పూర్తిగా నేలరాలాయి. రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. ఇటుక బట్టీల్లో తయారు చేస్తున్న ఇటుకలు పూర్తిగా నానిపోవడంతో నష్టం వాటిల్లింది. 14 పంచాయతీల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో సరఫరా లేక రాత్రంతా ప్రజలు అంధకారంలో ఇబ్బందిపడాల్సి వచ్చింది. విజయపురం, వడమాలపేట మండలాల్లోనూ గాలీవాన కారణంగా మామిడి రైతులకు నష్టం వాటిల్లింది. స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement