జెండా ఎగుర వేసే సమయానికే కార్యాలయానికి చేరుకున్న రేంజర్.. తాపీగా సిగరెట్ తాగుతూ జాతీయ జెండా, ఇతర సామగ్రిని లోపల పెట్టాలంటూ సిబ్బందిని ఆదేశించాడు. ‘సార్.. జెండా ఎగరేయాలి కదా.. లోపల పెడితే ఎలా’ అని ప్రశ్నించడంతో ‘ఇప్పుడే వస్తా’నని చెప్పి కారులో అశ్వారావుపేటలోని ఓ బెల్ట్‌షాపులోకి వెళ్లి మద్యం తాగాడు. ఇది గమనించిన స్థానికులు మీడియాకు సమాచారం అందించగా.. రేంజర్ వ్యవహార శైలి వెలుగులోకి వచ్చింది. మీడియా రేంజర్ కార్యాలయానికి వెళ్లి వివరాలు సేకరిస్తుండగా మద్యం తాగి వచ్చిన రేంజర్ కిందిస్థాయి సిబ్బందిపై చిందులేశాడు.
ఈ ఘటనపై రేంజర్ సదానందాచారిని ‘సాక్షి’ వివరణ కోరగా.. తాను మద్యం సేవించిన మాట వాస్తవమేనని, అయితే బీరు మాత్రమే తాగానని చెప్పాడు. పైగా అది ఆల్కహాల్ కాదంటూ సెలవిచ్చాడు. జాతీయ జెండా ఎందుకు ఆవిష్కరించలేదని అడిగితే మర్చిపోయానని.. ఒకసారి, ఎగురవేసిన తర్వాత తీసి కార్యాలయంలో పెట్టించానని మరోసారి పొంతన లేని సమాధానాలు ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.