సాక్షి, సిటీబ్యూరో: మర్కజ్ భయం గ్రేటర్‌వాసులను ఇంకా వెంటాడుతూనే ఉంది. బాధితులు, వారి కుటుంబ సభ్యుల క్వారంటైన్‌తో పాటు వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ సమీపిస్తున్నకొద్దీ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదువుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. విదేశాల నుంచి వచ్చిన వారితోనే ఎక్కువ ముప్పు ఉంటుందని భావించినప్పటికీ.. వారిలో పెద్దగా వైరస్ లక్షణాలు కన్పించక పోవడం, ఇప్పటికే వారంతా క్వారంటైన్‌ను పూర్తి చేసుకోవడం సంతోషించదగిన పరిణామమే. కానీ మార్చి 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని తబ్లిగీ జమాత్‌కు హాజరైన మర్కజ్ బాధితులతోనే ఆందోళన కొనసాగుతోంది. ఒకటి రెండు రోజుల్లో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి క్వారంటైన్ ముగియనుంది.
వైరస్ కేవలం వారు, వారి కుటుంబ సభ్యుల వరకే పరిమితమవుతుందా? లేక రెండో దశను దాటి.. మూడో దశకు చేరుకుందా? అనే అంశాలు స్పష్టంకానున్నాయి. తాజాగా బుధవారం హైదరాబాద్ జిల్లాలో మరో 11 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 161 మంది కరోనా పాజిటివ్ బాధితులు గాంధీ సహా కింగ్‌కోఠి, ఛాతీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 21 మంది ఇప్పటికే డిశ్చార్జి అయ్యారు. ఆరుగురు మృత్యువాతపడ్డారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 188కి చేరింది. ఇక రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 10 కేసులు పెరిగాయి. ఏడుగురు బాధితులు ఇప్పటికే డిశ్చార్జి కాగా, ఒకరు మృతి చెందారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 35కు చేరింది. మేడ్చల్ జిల్లాలో కొత్తగా 4 కేసులు పెరిగాయి. ఒకరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరొకరు మృతిచెందారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో కలిపి మొత్తం కేసుల సంఖ్య 244కు చేరింది.
వీరి నుంచి ముప్పు తొలగినట్లే..
మార్చి 2న తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించారు. ఆ తర్వాత రెండు రోజులకే విదేశాల నుంచి వచ్చే విమానాల రాకపోకలను నిలిపివేసింది. అప్పటి వరకు వివిధ దేశాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 74 వేల మంది చేరుకోగా, వీరిలో 25, 937 మందిని క్వారంటైన్‌కు తరలించారు. విదేశాల నుంచి వచ్చిన 30 మందికి ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత వారి నుంచి 20 మంది కుటుంబ సభ్యులకు వైరస్ సోకింది. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు వారి కుటుంబ సభ్యుల క్వారంటైన్ సహా వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. దాదాపు వీరి నుంచి వైరస్ సోకిన వారందరినీ ఇప్పటికే గుర్తించి క్వారంటైన్‌లో ఉంచారు. ఇక వీరి నుంచి ఇతరులకు వైరస్ సోకే అవకాశం చాలా తక్కువని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మర్కజ్ నుంచి వచ్చిన వారితోనే ముప్పు..
మార్చి 13 నుంచి 15 వరకు ఢిల్లీ మర్కజ్‌లోని జమాత్‌కు తెలంగాణ నుంచి 1089 మంది ఉండగా, జీహెచ్‌ఎంసీ నుంచి 603 మంది హాజరైనట్లు గుర్తించారు. వారితో పాటు వీరికి క్లోజ్ కాంటాక్ట్‌లో 3015 మంది ఉన్నట్లు గుర్తించి ఆ మేరకు వారందరినీ క్వారంటైన్‌కు తరలించింది. వీరిలో 172 మందిలో కరోనా ఉన్నట్లు వెల్లడైంది. వీరి నుంచి మరో 93 మంది కుటుంబ సభ్యులకు వైరస్ విస్తరించినట్లు గుర్తించారు. ఇక జీహెచ్‌ఎంసీ నుంచి మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 603 మందిలో ఇప్పటికే 593 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 63 మందికి పాజిటివ్ వచ్చింది. వీరి నుంచి మరో 45 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు.
ఇప్పటికీ నగరంలో మర్కజ్ కేసులకు సంబంధించిన ట్రేసింగ్ కొనసాగుతూనే ఉంది. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి నుంచి వారి కుటుంబ సభ్యులు, వారి నుంచి వారి బంధువులు, వారిని నుంచి ఇతరులకు వైరస్ సోకే అవకాశం లేకపోలేదు. వైరస్ విస్తరణ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారు, వారి బంధువులతోనే ఆగిపోతుందా? లేక సామాజిక వ్యాప్తికి కారణమవుతుందా? అనేది మరో వారం రోజుల్లో స్పష్టం కానుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
నిమ్స్‌లో ఎనిమిది మంది వైద్య సిబ్బంది క్వారంటైన్..
నిమ్స్ అత్యవసర విభాగంలో పనిచేస్తున్న ముగ్గురు వైద్యులు, అయిదుగురు నర్సులు క్వారంటైన్‌కు వెళ్లారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తికి వీరు క్లోజ్ కాంటాక్ట్‌కు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో వారిని క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
యునానీ క్వారంటైన్‌లోని 236 మందికి నెగెటివ్
చార్మినార్: చార్మినార్‌లోని ప్రభుత్వ నిజామియా జనరల్ (యునానీ) ఆస్పత్రిలో క్వారంటైన్‌లో ఉన్న 236 మందికి కరోనా నెగెటివ్ రపోర్టులు వచ్చాయి. వీరిని బుధవారం రాత్రి డిశ్చార్జి చేశారు. వీరంతా 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. 236 మందిలో 200 మంది బుధవారం రాత్రి తమ తమ ఇళ్లకు వెళ్లి పోగా...మిగిలిన 36 మంది గురువారం ఉదయం డిశ్చార్జి కానున్నారు.
ఆరోగ్య సర్వే షురూ..
పాతబస్తీలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. పాజిటివ్ కేసులున్న ప్రాంతాలను గుర్తించిన అధికారులు అవసరమైన మేరకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పాజిటివ్ పేషెంట్స్, వారి కుటుంబ సభ్యుల రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. దీంతో కరోనా ప్రైమరీ పాజిటివ్ కాంటాక్ట్ వారి రక్త నమూనాల సేకరణ పూర్తయ్యింది. ఇక పాజిటివ్ వచ్చిన ఏరియాల్లోని ప్రజల ఆరోగ్య పరిస్థితులను అంచనా వేయడానికి సర్వే నిర్వహిస్తున్నారు. ఆయా పాజిటివ్ ఏరియాలకు కిలో మీటర్ పరిధిలో ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. జ్వరం,జలుబు,శ్వాస సంబంధమైన సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment