కేసీఆర్‌ది జాగీర్దారీ పాలన
- ప్రశ్నించే గొంతులు నొక్కేలా నియంతృత్వ ధోరణి
- మిగులు నిధుల రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారు
- గత మూడేళ్లలో 3,080 మంది రైతుల ఆత్మహత్య
- ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరాం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న గొంతులు నొక్కుతూ నిజాం కాలం నాటి జాగీర్దారీ వ్యవస్థను తలపించేలా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని టీజేఏసీ చైర్మన్ కోదండరాం మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. టీజేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మిగులు నిధులతో ఏర్పడ్డ రాష్ట్రాన్ని మూడేళ్లలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.1.40 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని కోదండరాం దుయ్య బట్టారు.
నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం సాధించుకున్న రాష్ట్రాన్ని కుటుంబ పాలనగా మార్చేశారన్నారు. ఉద్యోగాల్లేక యువత, సరైన చేయూత లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మూడేళ్లలో 3,080 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అధికారులకు అందుబాటులోకి రాకుండా ఫాంహౌస్‌లో ఉంటూ కేసీఆర్ పాలనా వ్యవస్థను భ్రష్టు పట్టించారని కోదండరాం మండిపడ్డారు. రాష్ట్రం కోసం పోరాడినట్లు బంగారు తెలంగాణ సాధనకు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
80 వేల కోట్లతో ప్రతి గ్రామానికీ నీళ్లు..
రూ.80 వేల కోట్లతో తెలంగాణ మొత్తానికి నీటి సరఫరా చేయొచ్చని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి శ్రీరాం వెదిరే అన్నారు. కేసీఆర్ మూడు ప్రాజెక్టులకే రూ.2.40 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను దేశంలోనే అవినీతి రాష్ట్రంగా మార్చిన కేసీఆర్‌పై తిరుగుబాటు తప్పదని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు.
ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన..
రాష్ట్రాన్ని సాధించుకున్న లక్ష్యాలకు విరుద్ధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన సాగుతోందని సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ అన్నారు. ఉద్యమ సమయంలో తనను సంప్రదించిన కేసీఆర్.. ఇప్పుడు ఫోన్ కూడా చేయట్లేదన్నారు. సమావేశంలో సీనియర్ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, కోలిన్ గోన్సావెస్, ఐఎఫ్‌టీయూ అధ్యక్షురాలు అపర్ణ, ఢిల్లీ జేఏసీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.