మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : అధికారాన్ని చేజిక్కించుకోవాలని, గెలుపు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ప్రత్యర్థులతో పోటీపడి ఎన్నికల్లో ఖర్చు పెట్టిన నేతలు ఇప్పుడు ఆ ఖర్చులు చూసి బెంబేలెత్తుతున్నారు. తెలిసిన వారి నుంచి కొంత, అధిక వడ్డీలకు మరికొంత అప్పులు తీసుకురాగా, ఎన్నికలు, ఫలితాల వెల్లడి తరువాత లెక్కలు వేసుకుంటే గెలిచిన అభ్యర్థులతోపాటు, ఓడిన అభ్యర్థుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇంకొందరు స్థిరాస్తులు అమ్మి, బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఖాళీ చేసుకున్నారు.
వీరికి బాధ తక్కువగా ఉన్నప్పటికీ అప్పులు తెచ్చిపోటీ చేసిన వారి పరిస్థితి దారుణంగా ఉంది. అధికారంపై మనిషికి మమకారం పెరిగితే అది ఎంత వరకైనా తీసుకెళ్తుందని, ఏదైనా చేయిస్తుందంటూ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు తెలిసొచ్చింది. మనమే గెలుస్తామన్న ధీమాతో ఉన్నదంతా ఊడ్చి అప్పు తెచ్చి ఎన్నికల్లో నిలిచారు. అంచనాలు తలకిందులై చివరకు ఓటమి వరించడంతో బిక్క మొహాలు వేశారు. పట్టుదలకు, పంతాలకు పోయి అప్పుడు చేసిన ఖర్చులతో చేసిన అప్పులను ఎలా తీర్చాలోనంటూ తల పట్టుకుంటున్నారు.
పరిమితికి మించి ఖర్చులు
మున్సిపల్, పరిషత్, సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో చాలా మంది పట్టుదలకు పోయి ఓట్ల వేటలో విచ్చలవిడిగా ఖర్చు చేశారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 1,095 మంది, 636 ఎంపీటీసీ స్థానాల్లో 2,710 మంది, 52 జెడ్పీటీసీలకు గాను 267 మంది, 10 అసెంబ్లీ స్థానాల్లో 107 మంది, 2 ఎంపీ స్థానాల్లో 25 మంది మొత్తంగా అన్ని ఎన్నికల్లో కలిపి 4,204 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో సగానికి పైగా అభ్యర్థులు పరిమితికి మించి ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు సమాచారం. పోటీ చేసిన వారిలో చాలా మంది మధ్య తరగతి వారే కావడంతో వారు అప్పులు చేయాల్సి వచ్చింది. చాలామంది అభ్యర్థులు ఉన్న ఆస్తులు అమ్ముకోవడంతోపాటు, వడ్డీలకు అప్పులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు, యువజన సంఘాలకు, కుల సంఘాలను మచ్చిక చేసుకోవడానికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడంతోపాటు, విందులు ఏర్పాటు చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ. 10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇక ఎంపీటీసీ ఎన్నికల్లో ఒక్కొక్కరు పోటీని బట్టి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇతర పార్టీల అభ్యర్థులు ప్రలోభాలకు గురి చేస్తున్నారని తెలియడంతో, తమ వద్ద ఉన్న బంగారం, భూముల దస్తావేజులు, ఇళ్లను సైతం తాకట్టు పెట్టి డబ్బులు అప్పుగా తెచ్చుకున్నారు. మొదట అనుకున్న దానికంటే మూడు నుంచి పది రెట్లు అధికంగా డబ్బు ఖర్చు కావడంతో, ఇప్పుడు చేసిన అప్పులను తీర్చేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు.
గెలిచినా.. ఓడినా.. అప్పులే..
ఎన్నికల్లో అభ్యర్థులు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా పట్టుదలకు పోయారు. వెనక్కు చూడకుండా ఖర్చు చేస్తూనే వెళ్లారు. ఎన్నికలు ముగిసిన తరువాత లెక్కలు చూసుకుని బిక్కముఖం వేశారు. జిల్లా వ్యాప్తంగా వేల మంది ఎన్నికల పుణ్యమా అని అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు తెలిసింది. ఎన్నికల్లో గెలుపొందిన వారు చేసిన అప్పులు ఏ విధంగా తీర్చాలని ఆలోచిస్తుండగా, ఓడిన వారు ఓటమి భారంతో ఒకవైపు, అప్పుల తిప్పలతో మరోవైపు ఇబ్బంది పడుతున్నారు. ఓడినా, గెలిచినా మిగిలింది అప్పులేనంటూ పోటీ చేసిన అభ్యర్థులు నిర్వేదం చెందుతున్నారు. ఓటరు మాత్రం ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా, నా ఓటు మీకేనంటూనే తన పని తాను కానిచ్చేశాడని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు.
పట్టింపులు, పంతాలకు పోయి..
Published Thu, May 22 2014 1:44 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM
Advertisement
Advertisement